ఉక్రెయిన్-రష్యా యుద్ధం మారణహోమాన్ని తలపిస్తోంది. దాదాపు నెల రోజులుగా ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోన్న రష్యా.. తాజాగా దాడులను మరింత ఉధృతం చేసింది. నగరాలు, పట్టణాలు, ఆస్పత్రులు, స్కూళ్లను టార్గెట్ చేస్తూ బాంబులు, క్షిపణులతో రష్యా బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ యుద్ధంలో సైనికులతో పాటు ఎంతోమంది అమాయకులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా భీకర దాడులు చేస్తోంది. ఇందులో భాగంగానే జనావాసాలపైనా అత్యాధునిక క్షిపణులు, బాంబులతో రష్యన్ సేనలు విరుచుకుపడుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య కేంద్రాలపై దాడులు ఎక్కువగా జరిగాయని, ఆస్పత్రులు, అంబులెన్సులు, డాక్టర్లపై వేర్వేరుగా 72 దాడులు జరిగినట్టు తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ దాడుల్లో ఇప్పటి వరకు 71 మంది చనిపోగా, 37 మంది గాయపడినట్టుగా తెలిపింది. ఆస్పత్రులు కూడా ధ్వంసం అయ్యాయని, మెడికల్ ట్రాన్స్‌పోర్ట్స్, సప్లయ్ స్టోర్స్ కూడా దెబ్బతిన్నట్టు వివరించింది. అయితే మెడికల్ సెంటర్స్‌పై బాంబుల వర్షం రోజురోజుకు పెరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం.. ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో 58 ఆరోగ్య కేంద్రాలతో పాటు 11 అంబులెన్సులు, 16 మంది ఆరోగ్య సిబ్బంది, 10 మంది రోగులు, ఒక గిడ్డంగి ప్రభావితమయ్యాయి. ఆరోగ్య కేంద్రాలపై దాడి ఆధునిక యుద్ధంలో వ్యూహాత్మక చర్యగా మారినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అదే విధంగా ఉక్రెయిన్‌లో ఎక్కువ మెడికల్ సెంటర్లు, మెడికల్ షాపులు రష్యా నియంత్రించే ప్రాంతాల్లోనే ఉన్నట్టు తెలుస్తుంది.
Advertisements
రష్యా బలగాలు ఆస్పత్రులనే టార్గెట్ చేసి దాడులు జరపడంపై ఉక్రెయిన్ ప్రతినిధి జార్నో హబిచ్ కూడా స్పందించారు. రోజూరోజుకు ఆస్పత్రులను టార్గెట్ చేస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమని జార్నో హబిచ్ అన్నారు. ఆరోగ్య కేంద్రాలను, డాక్టర్లు, నర్సులకు, రోగులకు సురక్షిత ప్రాంతాలు కావాలని, ఇలా జరగకూడదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ఉక్రెయిన్ లోని చాలా మంది పౌరులు ఆయుధాలు పట్టి మాతృభూమి కోసం రోడ్లపైకి వచ్చి పోరాటాలు చేస్తున్నారు. యుద్ధం విషయంలో రెండు దేశాలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎప్పుడు ఈ యుద్ధానికి తెరపడుతుందనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది.