ఆకాశంలో రంగు రంగుల బెలూన్ ఎగురుతుంటూనే చూడముచ్చటగా ఉంటుంది. మనలోంచి పసితనం బైటకొచ్చి బుడగతో బంతులాడుతుంది. మరి ఐరావతం లాంటి బెలూన్ గాల్లో ఎగురుకుంటూ ఇళ్ళ మధ్యకొస్తే ఎలా ఉంటుంది. ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోని సిగ్రా ప్రాంతంలో అదే జరిగింది.
ఓ పార్కులో ఉంచిన ఓ హాట్ ఎయిర్ బెలూన్ గూడుమరచిన గువ్వలా, దారం తెగిన గాలిపటంలా ఎగురు కుంటూ వచ్చి ఇళ్ళమధ్యకు వచ్చి వాలింది. బొజ్జనిండా గాలి నిండి ఉన్న ఈ బెలూన్ లాండింగ్ను స్థానికంగా ఉన్న ప్రజలంతా ఆసక్తిగా చూశారు. చిన్నారులంతా కేరింతలతో ఉబ్బితబ్బిబ్బయ్యారు.
మరికొంత మంది దాని దగ్గరకు వెళ్లి ప్రత్యక్షంగా ముట్టుకుని తెగసంబరపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. జనవరి 17 నుంచి 20 మధ్య కాశీలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జరిగింది.