రాష్ట్రంలో పెరిగిన అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయి. విదర్భ నుంచి తెలంగాణ మీదుగా తమిళనాడు వరకు గాలుల్లో అస్థిరత కారణంగా 900 మీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
వర్షాలు పడే సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలున్నట్టు ప్రకటించింది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రాష్ట్రంలోని 12 ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపింది. అత్యధికంగా భద్రాచలంలో 2 సెంటీమీటర్లు, అశ్వాపురంలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణం శాఖ వారు వివరించారు.
ఇదిలా ఉంటే.. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతకు తట్టుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం అత్యధికంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రిపూట సైతం 25 నుంచి 27 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటున్నట్టు వాతవరణ శాఖ వెల్లడించింది.
పెరిగిన ఉష్ణోగ్రతలతో వడదెబ్బ భారిన పడుతున్నారు. వడదెబ్బ తగిలి రాష్ట్రంలో ఇప్పటికే ఇద్దరు మృతి చెందారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం గంగారం గ్రామానికి చెందిన కోరం వెంకటయ్య(52) అనే రైతు శనివారం రాత్రి మృతి చెందగా.. నల్గొండ జిల్లా నకిరేకల్‌లోని ఎస్‌ఎల్‌బీసీ కాలనీకి చెందిన ప్రభాకర్(48) అనే కూలీ వడదెబ్బతో మృతి చెందినట్టు రికార్డుల్లో నమోదైంది.