ఏదైనా హోటల్ కి వెళ్లి కడుపునిండా తిన్నాక.. వెయిటర్ కు మనకు ఇష్టం వచ్చినంత టిప్ ఇస్తుంటాం. అది పది రూపాయలు అవ్వొచ్చు, 20 రూపాయలు అవ్వొచ్చు. సర్వీస్ బాగుంటే 50 రూపాయలు ఇవ్వొచ్చు. కానీ.. వెయిటరే నాకు ఇంత టిప్ ఇవ్వాలనే డిమాండ్ ఎక్కడా కనిపించదు. కానీ.. శంషాబాద్ ఎయిర్ పోర్టు బావర్చీకి వెళ్తే మాత్రం ఆ సీన్ కనిపిస్తుంది.
మంగళవారం రాత్రి కొందరు యువకులు బిర్యానీ తినడానికి వెళ్లారు. కడుపునిండా తిన్నాక వెయిటర్ బిల్లు ఇచ్చాడు. బిల్లు కట్టేసి వెళ్లిపోయేందుకు చూశారు యువకులు. కానీ.. వెయిటర్ టిప్ ఇవ్వండని వాగ్వాదానికి దిగాడు. కస్టమర్లు కూడా తగ్గకపోవడంతో మాటా మాటా పెరిగింది. హోటల్ సిబ్బందితో కలిసి వారిపై దాడికి తెగబడ్డాడు వెయిటర్.
విషయం పోలీసుల దగ్గరకు చేరింది. వెంటనే స్పాట్ కు చేరుకుని యువకులను సముదాయించి అక్కడి నుంచి పంపించేశారు. అయితే.. యువకులు మాత్రం వెయిటర్‌పై స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.