పల్నాటి యుద్ధం! - Tolivelugu

పల్నాటి యుద్ధం!

పల్నాటి యుద్ధ ప్రభావం రాష్ట్రమంతటా కనిపిస్తోంది. ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి బయల్దేరుతున్న టీడీపీ నేతల్ని పోలీసులు ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేస్తున్నట్టు సమాచారం. మరోపక్క వైసీపీ కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని చేపట్టింది. పోటాపోటీ యాత్రలతో రాష్ర్టంలో రాజకీయ వేడి బాగా రగులుకుంది.

గుంటూరు:  పల్నాడులో వైసీపీ అరాచకాలతో వేధింపులకు గురవుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం తెలుగుదేశం అండగా వుంటుందని పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన ‘ఛలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో పార్టీ శ్రేణులన్నీ గుంటూరు జిల్లాకు దారులు తీస్తున్నాయి. ఐతే, ఎవరినీ జిల్లాలో అడుగు పెట్టనీయకుండా ఎక్కడివారిని అక్కడే అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు సమర్ధమైన వ్యూహాన్ని అమలుచేస్తున్నారు.

తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ నివాసాన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. అక్కడ భారీగా పోలీసుల మోహరించారు. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విజయవాడలో హౌస్ అరెస్ట్ చేశారు. గుంటూరు నుంచి తిరిగి వచ్చిన రామయ్యను పోలీసులు చుట్టుముట్టి ఇంటిలోకి పంపించి హౌస్ అరెస్ట్ చేశారు. ‘ఛలో ఆత్మకూరు’కు సిద్ధమవుతున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నని గత రాత్రి 12.30 గంటలకు సీఐ కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ మోహన్ ఇంటి ముందే పోలీసులు మోహరించారు.

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్లనీయకుండా గృహ నిర్బంధంలో ఉంచారు. అమలాపురంలో టీడీపీకి చెందిన మాజీ శాసనసభ్యుడు అయితా బత్తుల ఆనందరావును హౌస్ అరెస్ట్ చేశారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల ఇంటి ముందు పోలీస్ పికెటింగ్ వుంది. జిల్లా వ్యాప్తంగా 54 మంది టీడీపీ నేతలను ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నారు.

కృష్ణాజిల్లా నుంచి ఎవర్నీ గుంటూరు జిల్లాలోకి అడుగు పెట్టనీయకుండా పోలీసులు రెండు వారధుల దగ్గర భారీగా మోహరించారు. నందిగామ నుంచి  ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్ళనీయకుండా  తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను గృహ నిర్బంధంలో వుంచారు. గుంటూరులో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును పోలీసుల నిర్బంధంలో తీసుకున్నారు. పల్నాడు ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబును బుధవారం ఉదయం హాస్పటల్‌లోనే పోలీసులు నిర్బంధించారు. ఆయనతో పాటు పలువురు నేతలను తమ గృహాలకు మాత్రమే పరిమితం చేసే విధంగా పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp