ఇల్లు పాతదయిందన్నారు.. ఏవేవో రూల్స్ చెప్పి కూల్చేశారు. సాయం చేస్తాం.. డబ్బులు ఇస్తాం.. ఇంటి నిర్మాణానికి తోడ్పడతామని ఎన్నో చెప్పారు. 10 నెలలు దాటింది. న్యాయం చేయమని అడిగేందుకు వెళ్తే పట్టించుకునే నాథుడు లేడు. 70 ఏళ్ల వయసులో ఏం చేయాలో.. ఎవరిని అడగాలో తెలియని దీనస్థితిలో ఉంది ఆ దళిత వృద్ధురాలు.
ఉప్పల్ లోని భరత్ నగర్ లో మోత్కుపల్లి నర్సమ్మ అనే దళిత వృద్ధురాలు జీవనం సాగిస్తోంది. భర్త లేడు. పెద్ద కుమారుడు మరణించాడు. చిన్న కొడుకు తాగుబోతు. అతడి భార్య కూడా చనిపోయింది. మనవరాలు, తాగుబోతు కొడుకుతో కలిసి ఉంటోంది నర్సమ్మ. అయితే గతేడాది వీరు ఉంటున్న పెంకుటిల్లు శిథిలావస్థకు చేరిందని జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. తక్షణ సహాయంగా డబ్బులు చెల్లిస్తామన్నారు. కానీ.. పది నెలలు దాటినా ఇంతవరకు సాయం అందలేదు. స్థానికుల సహకారంతో తాత్కాలికంగా పరదాలతో గూడు నిర్మించుకుంది ఈ వృద్ధురాలు. అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు. పరుదాల చాటున 12 ఏళ్ల మనవరాలితో ఇబ్బందులు పడుతోంది.
నర్సమ్మ కష్టాలు తెలిసిన స్థానిక బీజేపీ నేతలు ఆమెకు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ దళితులకు రూ.10 లక్షలు ఇస్తున్న ప్రభుత్వానికి… రాష్ట్రంలోని మిగిలిన దళితులు గుర్తులేరా అని ప్రశ్నించారు. ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులను, ఎమ్మార్వోను కలిసి నర్సమ్మ సమస్యపై నిలదీశారు. ఇక్కడే అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. అసలు.. నర్సమ్మ సమస్యను స్థానిక అధికారులు కలెక్టర్ కార్యాలయానికే పంపలేదు. వెంటనే ఆమెకు ఇవ్వాల్సిన తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు. అలాగే ఇల్లు కూడా ప్రభుత్వం కట్టివ్వాలని లేకపోతే ఎమ్మార్వో, కలెక్టర్ ఆఫీస్ లను ముట్టడిస్తామని హెచ్చరించారు.