సినిమాల్లో సెట్టింగ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. గతంలో స్టూడియోల్లోనే సెట్లు వేసి షూటింగ్ చేసేవారు. ఆ తరువాత ట్రెండు మార్చారు. కాస్ట్ కలిసొస్తుందని నేచురల్ ఎఫెక్ట్ కోసం ఔట్ డోర్‌లో అనువైన బంగ్లాల్లో మూవీలు తీయడం మొదలెట్టారు. ఒక్కడు, అరుంధతి, అర్జున్, మగధీర, మర్యాదరామన్న, బాహుబలి తదితర చిత్రాలు అద్భుతమైన సెట్టింగులతో అలరించాయి. కొంచెం వెరైటీ, కొంచెం సౌలభ్యం కోరుకుంటున్న నిర్మాతలు సెట్టింగులతో సినిమాలు తీయడం అలవాటు చేసుకున్నారు. అదే కోవలో ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తాజా మూవీ ‘ప్రతి రోజూ పండగే’ కోసం హైదరాబాద్ శివార్లలో భలే సెట్ వేశారు. ఇందులో సాయిధరమ్ తేజ్ హీరో.. దర్శకుడు మారుతి.
డైరెక్టర్ మారుతి అంటే చెప్పక్కర్లేదు. అతని ఆఫీస్ హైదరాబాద్‌లో ఎంతో కళాత్మకంగా ఉంటుంది. అందులో ఇంచ్ ఇంచ్ ఆయన ఏరికోరి డిజైన్ చేయించుకున్నారు. ఇప్పుడు తన చిత్రం షూటింగ్ కోసం రాజమండ్రి ఏరియాలో ఒక ఇంటిని వోల్డ్ గ్రాండ్ లుక్‌తో 17 రోజుల్లో రూపొందించారు. దీనికోసం కోటీ పాతిక లక్షలు ఖర్చయ్యిందట. ఎక్కడా సిమెంట్ వాడకుండా రబ్బర్, జిప్సంతో ఈ సెట్ రూపొందించారు. మర్యాదరామన్న ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ అపూర్వ సృష్టి ఈ సెట్. రాజమండ్రిలో ఇప్పుడిది అందరినీ అలరిస్తోంది. 200 మంది వర్కర్లు నిర్మించిన ఈ ఇల్లు ఐదేళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉంటుందని నిర్మాణదారులు చెబుతున్నారు. ఈ ఇల్లు నచ్చి అల్లు అరవింద్ కళా దర్శకుణ్ని తెగ మెచ్చేసుకున్నారు.