చుట్టూ అంతా పోలీసులే..వాళ్లంతా మామూలు ఖాకీలు కూడా కారు. కాబోయే ఐపీఎస్ లు ఇంకా వారికి ట్రైనింగ్ ఇస్తున్న సూపర్ సీనియర్ ఐపీఎస్ లు. ఆ ప్రాంతమంతా నిఘా నేత్రాల మధ్య బంధించి ఉంది. చీమ చిటుక్కు మన్న ఇట్టే తెలిసిపోతుంది. మరి అలాంటి ప్లేస్ నుంచి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 కంప్యూటర్లను ఓ కేటుగాడు మాయం చేశాడు..ఈ దొంగతనం ఎక్కడ.. ఎలా జరిగిందంటే..
రాజేంద్ర నగర్ లోని నేషనల్ పోలీస్ అకాడమీలో ఈ దొంగతనం జరిగింది. మరి ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ బయటి దొంగకు ఛాన్సే లేదు. కాబట్టి ఇంటి దొంగే ఇంతటి సాహసం చేశాడు. అకాడమీలో ఉన్న భద్రతా బలగాల కళ్లు గప్పి 7 కంప్యూటర్లను ఆ కేటుగాడు మాయం చేశాడు. అయితే ఇంటి దొంగను ఆ దేవుడు కూడా పట్టుకోలేడు అన్నట్టుగా.. అకాడమీ సిబ్బందికి ఈ దొంగతనం విషయం చాలా ఆలస్యంగా తెలిసింది.
కంప్యూటర్లు కనిపించకపోవడంతో.. సీసీటీవీ ఫుటేజీని అధికారులు పరిశీలించారు. దీంతో ఆ కేటుగాడి బండారం బయటపడింది. కంప్యూటర్లను ఎత్తుకెళుతున్న దృశ్యాలు ఫుటేజీలో స్పష్టంగా ఉన్నాయి. దీంతో దొంగను రెడ్ హ్యాండెడ్ గా పోలీసు అకాడమీ కాప్స్ పట్టుకున్నారు.
అయితే ఆ దొంగను అకాడమీలో ఐటి సెక్షన్ లో పని చేస్తున్న చంద్రశేఖర్ గా గుర్తించారు. అతడిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో NPA అధికారులు ఫిర్యాదు చేయడంతో..కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.