– రూ.1,500 కోట్ల మళ్లింపుపై రెయిడ్స్
– లక్ష్మి నారాయణ సన్నిహితుల ఇళ్లలో సోదాలు
– ఫినిక్స్ కు బిగుస్తున్న ఉచ్చు!
– మనీ లాండరింగ్ పైనే ఫోకస్
– భయాందోళనలో డైరెక్టర్స్
– అరెస్టులు ఉంటాయంటున్న అధికారులు
– ఈడీ దెబ్బతో విదేశాలకు పార్ట్ నర్స్
– బూదాటితో అందరికీ మిగిలింది బూడిదే!
క్రైంబ్యూరో, తొలివెలుగు:మూడు వేల మందిని నట్టేట ముంచి.. రూ.1,500 కోట్లు వెనకేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సాహితీ కన్ స్ట్రక్షన్స్ యాజమాన్యంపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్లు నాయకుల నుంచి అధికారులు, మార్కెటింగ్ వాళ్లు కూడా భారీగా దొచుకున్నారన్న ఆరోపణలు వున్నాయి. రూ.1,500 కోట్లలో దుబారా ఖర్చు రూ.500 కోట్లని లెక్కల్లో తెలుస్తోంది. అందులోనే పెళ్లిళ్లు, పేరంటాలు, పార్టీలు, పబ్స్, క్లబ్ డ్యాన్స్ లు, మత్తు పదర్థాలతో పాటు నాయకులకు ఇచ్చిన కమీషన్స్ ఉన్నాయని ఈడీ తేల్చింది. క్యాష్ రిసీట్ ను కూడా స్వాధీనం చేసుకున్న అధికారులు.. మొత్తం బండారాన్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
సాహితీ నుంచి వెళ్లిన ప్రాజెక్ట్స్ పై పిలుపు
సాహితీకి అమీన్ పూర్ ల్యాండ్స్ ఇచ్చింది ఫినిక్స్ కంపెనీ అని తెలుస్తోంది. ఆ తర్వాత ఏఐజీ హాస్పిటల్ ఎదురుగా ఉన్న ల్యాండ్స్, బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 12లోని భూమిని కేశినేని ట్రావెల్స్ కు అప్పగించేందుకు రాయబారం నడిపింది ఫినిక్స్ డైరెక్టర్స్ అని సమాచారం. అప్పటికే సాహితీ అమ్మకం జరిపింది. వారిని కాదని కొత్త అనుమతులు, కొత్త అమ్మకాలు జరపడాన్ని ఈడీ అధికారులు గుర్తించారు. దీంతో డబ్బులు ఎక్కడికి చేరాయనేది కీలకంగా మారింది. సాహితీ నిధి.. ఫినిక్స్ ఎండీ గోపీకృష్ణకు బదలాయించారా? బోగి శ్రీధర్ రావు భుజించింది ఎంత? అని ఆరా తీస్తున్నట్టు ఈడీ వర్గాలు చెబుతున్నాయి.
భయాందోళనలో డైరెక్టర్స్
సాహితీతో స్నేహం చేసిన వారంతా ఇప్పుడు భయం గుప్పిట్లో బతుకుతున్నారని అంతా చర్చించుకుంటున్నారు. లక్ష్మి నారాయణ అక్రమ సొమ్మును తామెక్కడ తిన్నామో.. ఈడీ ఎప్పుడు పిలుస్తుందోనని అందరూ తెగ కంగారుపడుతున్నారు. మై హోం భుజాలో లక్ష్మి నారాయణతో పాటు ముగ్గురు డైరెక్టర్స్ ఉంటున్నట్లు సమాచారం. అక్కడనే సీక్రెట్ మీటింగ్స్ జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారని ఇంటెలిజెన్స్ వారు వివరాలు సేకరించినట్టు తెలుస్తోంది.
విదేశాలకు వెళ్లినట్టు కలరింగేనా?
ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొంటున్న డైరెక్టర్స్, లబ్దిదారులుగా వున్న లాబీయింగ్ చేసిన వాళ్లను ఈడీ విచారణకు పిలిచింది. ఫినిక్స్ కు చెందిన మేనేజింగ్ డైరెక్టర్ గోపీకృష్ణ, మరో ఇద్దరు డైరెక్టర్స్ ను పలుమార్లు విచారించింది. ఫినిక్స్ వ్యవహారాలను చక్కబెడుతున్న మరో కంపెనీ, బినామీగా ఉన్న బోగి శ్రీధర్ రావును నెల రోజులుగా విచారిస్తోంది. దీంతో వారంతా ఈ బాధను భరించలేకే విదేశాలకు వెళ్లినట్లు చెప్పుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఎటు వెళ్తున్నారు.. ఎక్కడ ఉంటున్నారో ఎప్పటికప్పుడు వారిపై ఓ నిఘా బృందం కన్నేసి ఉంచుతోంది. మిగితా డైరెక్టర్లకు కూడా ఫోన్లు చేసి అందుబాటులో ఉండాలని, పిలిచినప్పుడు రావాలంటూ ఈడీ హెచ్చరించింది. దీంతో వారంతా విదేశాలకు వెళ్లకుండానే ఇక్కడే సీక్రెట్ గా ఉంటూ, తామంతా విదేశాల్లో ఉన్నామని హెల్త్ చెకప్ అంటూ దాటవేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈడీ అరెస్టులు ఎప్పుడు?
వందల కోట్ల రూపాయలు తిన్న బడాబాబులకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. ఈడీ ఎటు నుంచి ఎటు కేసును తీసుకెళ్తుందోనని భయపడుతున్నట్టు అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. విచారణలో ఒప్పుకోకపోతే అరెస్టులు చేస్తామని అధికారులు అంటున్నారు. కానీ, ఇందులో ఎక్కువగా క్యాష్ రూపంలో ఉండటంతో సమయం పడుతోందని చెబుతున్నారు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మనీ లాండరింగ్ జరిగిందని పేర్కొంటున్నారు. ఫినిక్స్ డైరెక్టర్స్ కు నాయకులతో లింకులు వున్నాయని, అరెస్టులు తప్పవని తెలుస్తోంది. మార్కెటింగ్ డైరెక్టర్ గా పని చేసిన పూర్ణచందర్ ఇంటికి అధికారులు వెళ్లి తనిఖీలు చేశారు. అరెస్టుల పర్వం మొదలైతే ఇక ఆగే పరిస్థితి ఉండదంటున్నారు ఈడీ అధికారులు.