ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లోపల జరుగుతున్న దొంగతనాల రాకెట్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఎనిమిది మంది వ్యక్తులు ఈ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. పోలీసులు వారి వద్ద నుంచి రూ.10 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
ఈ ఎనిమిది మంది కూడా ఎయిర్ పోర్ట్లో పని చేస్తున్న వివిధ ఎయిర్ లైన్స్ , గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీలలో లోడర్లుగా పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, 6 బ్రాండెడ్ వాచీలు, యాపిల్ ఐ-ఫోన్ , రూ.1,15,000 నగదును స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
వీరిని అరెస్ట్ చేయడంతో నాలుగు సామాను దొంగతనం కేసులు పరిష్కరమైయ్యాయి అని పోలీసులు తెలిపారు. ఒక ప్రయాణికుడి రిజిస్టర్ చెక్ ఇన్ బ్యాగేజీని దొంగిలించడానికి ప్రయత్నించిన దీపక్ పాల్ అనే లోడర్ ను ఎయిర్ లైన్స్ విజిలెన్స్ విభాగం సహాయంతో పట్టుకున్నారు. పోలీసులు దీపక్ ని విచారించగా అతను గత 5 సంవత్సరాలుగా గ్రౌండ్ హ్యాండ్లింగ్ అసిస్టెన్స్ అందించే కంపెనీలో లోడర్గా పని చేస్తున్నట్లు వెల్లడించాడు.
జీతం సరిపోకపోవడం వల్లే అవకాశం దొరికినప్పుడల్లా ప్రయాణీకుల సామాను నుంచి చిన్న దొంగతనాలు చేయడం ప్రారంభించినట్లు నిందితుడు పేర్కొన్నాడు. క్రమంగా అతను విమానయాన సంస్థలు, ఏజెన్సీలలో పని చేసే ఏడుగురు లోడర్లు , గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందితో పరిచయం పెంచుకున్నాడు. వారంతా ఒక దగ్గరే ఉంటూ ఒకే టైమింగ్ షిఫ్టుల్లో పని చేస్తూ పక్కా ప్రణాళికలతో ముఠాగా ఏర్పడి పెద్ద ఎత్తున సామాను చోరీకి పాల్పడుతున్నారని పోలీసులు వివరించారు.
సాంకేతిక నిఘా సహాయం ద్వారా అనుమానాస్పద లోడర్ల ఆచూకీని కనుగొన్నారు. దీంతో ఒక్కసారిగా దాడులు నిర్వహించగా ఎనిమిది మందిని ఒకేసారి పట్టుకున్నారు. నిందితులను గౌతమ్ కుమార్, మోషిన్ ఖాన్, రాహుల్ యాదవ్, యశ్విందర్, పప్పి కుమార్, నీరజ్ కుమార్, కమల్ కుమార్ గా పోలీసులు గుర్తించారు.
ప్రయాణికుల లగేజీల నుంచి దొంగిలించిన వస్తువులను లాకర్లో దాచి పెట్టి వీలు చిక్కినప్పుడల్లా బయటకు తరలించేవారని పోలీసులు తెలిపారు.