రాష్ట్రంలో ఇటీవల భారీ ఎత్తున గంజాయి పట్టుబడుతుండటం హాట్ టాపిక్ గా మారింది. సుమారు 2 లక్షల కిలోల గంజాయిని పోలీసులు కాల్చివేశారంటేనే గంజాయి సాగు ఏ స్థాయిలో సాగుతుందో అర్థమవుతోంది. వీటన్నింటిని చూస్తుంటే ఏపీ గంజాయి హబ్ గా మారిందన్న పలువురి విమర్శలు నిజమేనా అనిపిస్తున్నాయి.
వీటన్నింటిని విన్నప్పుడు అసలు రాష్ట్రంలో గంజాయి పంటకు ఎక్కడ బీజం పడింది. గంజాయి హబ్ గా మారిందనే స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడానికి దారి తీసిన కారణాలు ఏంటీ.. గంజాయి సాగును అధికారులు ఎందుకు అరికట్టలేకపోతున్నారు అనే సందేహాలు వస్తాయి. వీటన్నింటికి కారణాలను ఒక సారి ఆలోచిస్తే..
రాష్ట్రంలో గంజాయికి బీజం
రాష్ట్రంలో గంజాయి సాగుకు సంబంధించిన గుర్తులు 70 వ దశకం నుంచే కనిపిస్తాయి. 1985లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ అమలులోకి వచ్చింది. కానీ ఆ చట్టం అమలులోకి రాకముందే (దాదాపు 45 ఏళ్ల క్రితం) 1973లో గంజాయి అక్రమ రవాణాపై తొలి కేసు నమోదైందన్న విషయాన్ని తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.
ఎస్ఈబీ డిప్యూటీ కమిషనర్ బాబ్జీ రావు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు, కేరళకు చెందిన కొందరు ఏపీలోని కొన్ని ప్రాంతాలను గుర్తించారు. అక్కడ విత్తనాలు నాటడంతో రాష్ట్రంలో గంజాయి పంట సాగు మొదలైంది. ఆ తర్వాత వ్యాపారులుగా చెప్పుకునే కొందరు ఈ ప్రాంతానికి వచ్చి కొందరు కీలక వ్యక్తుల సహాయంతో అక్కడ ట్రైబల్స్ ను గంజాయి సాగులోకి దించారు. ఇదంతా ఒక్క రోజులో జరిగింది కాదు. కొన్ని దశాబ్దాలుగా ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది.
గంజాయి సాగుకు అనుకూల వాతావరణం
ఇక్కడ వాతావరణం, నేలల రకాలు గంజాయి సాగుకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో చాలా మంది ఈ ప్రాంతంపై ఫోకస్ చేశారు. గంజాయి సాగు లాభదాయకంగా ఉండటం, సులభంగా లాభాలు వస్తుండటం, మిగతా పంటలతో పోల్చినప్పుడు తక్కువ శ్రమ అవసరం ఉండటం ఆర్థిక స్థిరత్వం వస్తుండటం, అభివృద్ది పరంగా వెనుకబడి ఉండటం వంటి కారణాలతో ట్రైబల్స్ గంజాయి సాగుకు ఆకర్షితులయ్యారు. దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న గంజాయి రవాణా 2005 నుంచి తీవ్రంగా మారినట్టు అధికారులు చెబుతున్నారు.
గంజాయి అధికంగా సాగయ్యే ప్రదేశాలు..
రాష్ర్ట్రంలో పండించే గంజాయిని శీలావతి అంటారు. దీనికి దేశవ్యాప్తంగా భారీ డిమాండ్ ఉంది. క్వాలిటీ పరంగా చూస్తే దేశంలోనే అత్యంత నాణ్యమైన గంజాయిగా దీనికి పేరు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతోంది. ప్రధానంగా విశాఖ ఏజెన్సీ, ఆంధ్రా- ఒడిశా సరిహద్దు ప్రాంతంలో, ఏజెన్సీలోని 11 మండలాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు.
నగరాల్లో మూడు రెట్ల అధిక లాభం…
ఏజెన్సీలో సాగు చేస్తున్న గంజాయికి నగరాల్లో మంచి డిమాండ్ ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానిక మార్కెట్లతో పోలిస్తే అక్కడ దాదాపు మూడు రెట్ల వరకు లాభాలు పొందవచ్చని అంటున్నారు. అందువల్ల నగరాలకు గంజాయిని అక్రమంగా రవాణా చేసేందుకు వ్యాపారులు ప్రాధాన్యత ఇస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
అధికారులకు ఎదురవుతున్న సవాళ్లు
ఈ ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాతినిధ్యం బలంగా ఉండటం అధికారులకు సమస్యగా మారింది. దీని వల్ల పోలీసులు ఈ ప్రాంతాల్లోకి ప్రవేశించలేకపోతున్నారు. గంజాయి సాగు చేస్తున్న ఆయా మండలాల్లో చాలా వరకు గ్రామాలకు సరైన రోడ్డు వసతులు కూడా లేకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది.
సత్ఫలితాలు ఇస్తున్న పరివర్తన …
ఇప్పటి వరకు ఆపరేషన్ పరివర్తన కింద 11 మండలాల్లోని 313 గ్రామాల్లో 7552 ఎకరాల గంజాయిని ధ్వంసం చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. ఆ గంజాయి పంట విలువ రూ. 9251 కోట్లు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. ఆపరేషన్ లో భాగంగా 120 చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆపరేషన్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1500 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
ఆపరేషన్ పరివర్తనలో భాగంగా గిరిజనులకు అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాము. ప్రత్యామ్నాయ జీవనోపాధిని చూపించడం. యువతకు నైపుణ్యాభివృద్ధికి కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటిపై దృష్టి సారించడం. ప్రస్తుతం ఆపరేషన్ పరివర్తన సత్ఫలితాలను ఇస్తోందని అని అధికారులు అంటున్నారు.