ఐఐటీ వంటి అత్యున్నత విద్యాసంస్థల్లోనూ కుల వివక్ష సాగుతున్న వైనం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. బాంబే ఐఐటీలో దళితుడైన దర్శన్ సోలంకి అనే 18 ఏళ్ళ విద్యార్ధి.. ఇటీవల ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. క్యాంపస్ లో తనను కులం పేరిట వేధిస్తున్నారని, అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ మనస్తాపంతో ఆ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు. తన సన్నిహితుల వద్ద వాపోయి.. ఇక భరించలేక బలవన్మరణం చెందాడు.
సోలంకి కుల వివక్షను ఎదుర్కొంటున్నాడని, పరీక్షలకు సంబంధించిన డిప్రెషన్ తో బాధ పడుతూ వచ్చాడని కెమికల్ ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్ధి ఒకరు చెప్పారు. ఈ కేసులో ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని వర్తింపజేసి అతని ఆత్మహత్యకు కారకులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కనీసం 50 శాతంమంది ఎస్సీ. ఎస్టీ సభ్యుల ప్రాతినిధ్యంతో కూడిన స్వతంత్ర సంస్థ చేత దీనిపై విచారణ చేయించాలని కోరారు.
అయితే 12 మంది సభ్యులతో గల కమిటీ ఈ ఉదంతపై విచారణ జరిపి.. కుల వివక్ష వంటిదేదీ లేదని తేల్చింది. ప్రొఫెసర్లుగానీ, ఇతర అధ్యాపకులు లేదా విద్యార్థులు గానీ సోలంకీ పట్ల ఇలా అవమానకరంగా వ్యవహరిచారనడానికి ఆధారాలు లేవని వెల్లడించింది. ఇది ‘ఇన్స్టి ట్యూషనల్ మర్డర్’ తో సమానమని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. పోలీసులు ఇంకా దీనిపై ఇన్వెస్టిగేషన్ చేస్త్తున్నారని, ఈ విద్యార్ధి ఇలా వివక్షకు గురికాలేదని ఈ కమిటీ స్పష్టం చేసింది.
అహ్మదాబాద్ కు చెందిన సోలంకీ ఈ ఐఐటీ క్యాంపస్ హాస్టల్ బిల్డింగ్ ఏడో అంతస్థు నుంచి కిందికి దూకి సూసైడ్ చేసుకున్నాడు. బీ టెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థి మృతి పట్ల ఐఐటీలో చదువుతున్న విద్యార్థులు తీవ్ర సంతాపం ప్రకటించారు.