అయ్యా ఎస్ అనేందుకు ఐఏఎస్ చదవనేల
జీహూజూర్ అనేందుకు జీతాలు తీసుకోనేల
అందలం కోసం అహం చంపుకోనేల
అవమానంతో నలుగురిలో నగుబాటు ఏల
విశ్వదాభిరామ… వినండి అధికారుల క్షోభ
ఒకసారి కురవడం మొదలెట్టాక మేఘం కరిగిపోతుంది. ఒకసారి లొంగడం మొదలెట్టాక మన పవర్ మొత్తం ఆవిరైపోతుంది. ఆ విషయం మర్చిపోయిన ఎల్వీ సుబ్రమణ్యంగారు అహం దెబ్బ తినడంతో.. ఎదురు తిరిగారు. కాని అప్పటికే పరిస్ధితి చేయి దాటిపోయిన సంగతి మర్చిపోయారు. పుస్తకమే పెన్నును వెక్కిరించినట్టు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎదురొచ్చి చీఫ్ సెక్రటరీని బదిలీ చేసేశారు. సలహాదారులంటూ ఇప్పటికే పాలనావ్యవస్ధకు సమాంతరంగా మరో పరిపాలనా వ్యవస్ధను సృష్టించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అయినా తాననుకున్న పనులు చేసుకోలేక, ఒక వర్చువల్ చీఫ్ సెక్రటరీని పొలిటికల్ సెక్రటరీ పేరుతో పెట్టేశారు. అప్పటికే సంతకాలు పెట్టడం తప్ప ఏమీ చేయలేకపోతున్న చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంగారికి , ఈ కొత్త శక్తి ప్రవీణ్ ప్రకాష్ సిస్టమేటిక్ గా తన కుర్చీకున్న పవర్ ని లాగేస్తుంటే వళ్లు మండిపోయింది. తొక్కేయడం ఎలాగూ తొక్కేశారు.. కనీసం ఒక పద్ధతి పాడు ఉండదా అనుకున్నారో ఏమో, షోకాజ్ నోటీసు ఇచ్చారు. అంతే ఇంకేముంది, 48 గంటల్లో రిటర్న్ గిఫ్ట్ ట్రాన్సఫర్ ఆర్డర్ రూపంలో వచ్చేసింది. పాపం, ఎల్వీ సార్ కి ఒక్కసారిగా కాలచక్రంలో ఫ్లాష్ బ్యాక్ గిర్రున తిరిగి కనపడే ఉంటుంది.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కీలక పదవులు నిర్వహించిన ఎల్వీ సుబ్రమణ్యం, ఆ తర్వాత వైఎస్ జగన్ కేసులో నిందితుడిగా చేరాల్సి వచ్చింది. చివరకు ఆ కేసు నుంచి బయటపడ్డారు. చంద్రబాబునాయుడు ఆయనను దూరంగానే పెట్టారని చెప్పుకోవాలి. సీనియారిటీ ఉన్నా, నాయుడుగారు దూరం పెట్టడంతో సుబ్రమణ్యంగారు నొచ్చుకున్నారు. అయినా తనకు అప్పచెప్పిన బాధ్యతలు ఉన్నంతలో బాగానే నిర్వర్తించారు. ఆఖరుకి నిరుద్యోగుల భృతి కోసం పథకం రూపకల్పన, బాబుగారి సూచనల మేరకు ఈయనే తయారు చేశారు.
ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల కమిషన్ కి అధికారం వచ్చింది. ఒకవైపు చంద్రబాబునాయుడు తాను ప్రకటించిన పథకాల సొమ్ములు జనానికి అందచేయాలనే తాపత్రయంలో ఆ డబ్బు ఈ డబ్బు అని చూడకుండా, అటు ఇటు మార్చేసి పసుపు కుంకుమ, రైతులకు డబ్బులు వేసేశారు. రుణమాఫీ చివరి విడతలకు కూడా రంగం సిద్ధం చేసేశారు. ఇలా బాబు డబ్బులు వేసుకుంటూ పోతే, మన పని ఖాళీ అని భయపడిన వైసీపీ, వెంటనే విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపింది. అప్పటికే బిజెపితో బాత్ చీత్ బ్రహ్మాండంగా సెట్ చేసుకున్న విజయసాయిరెడ్డి ఎన్నికల కమిషన్ తో మాట్లాడుకుని అప్పటికప్పుడు అప్పటి చీఫ్ సెక్రటరీ అనిల్ చంద్ర పునేఠను ఢిల్లీకి పిలిపించి మరీ వాయించి, తర్వాత బదిలీ చేసేశారు. ఇదే టాక్ అప్పుడు వినపడింది. ఆయన స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను నియమించారు. ఇదంతా జగన్ సూచనలమేరకే జరిగిందని చెప్పుకుంటారు.
ఇక ఎల్వీ సుబ్రమణ్యంగారు వచ్చాక చంద్రబాబు ఒక్క పేమెంట్ చేయకుండా ఆపేశారు. ఏ నిధులు కదలకుండా చూశారు. రైతు రుణమాఫీ చెల్లింపు ఆగిపోయింది. ఆఖరుకి తుఫాను వస్తే రివ్యూ చేయడానికి కూడా చంద్రబాబుకు అధికారం లేదనేంత దూరం ఎల్వీఎస్ వెళ్లిపోయారు. ఆయన హాజరు కాకపోవడమే కాక, ఏ అధికారి వెళ్లకూడదని హుకుం జారీ చేశారు. చంద్రబాబు అవాక్కయ్యారు. ఏం చేయలేక ఊరుకున్నారు.
ఎన్నికలు అయిపోయాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. మన పని ఇక బాగుంటుంది అనుకున్నారు ఎల్వీ సుబ్రమణ్యం. పైగా మొదటి సమావేశంలో ఎల్వీ సుబ్రమణ్యం అన్న ఏమైనా ఉంటే నాకు సలహాలు చెప్పాలి అన్నారు. అదే సమావేశంలో శానిటరీ వర్కర్ల జీతాల పెంపుపై టెక్నికల్ సమస్యలున్నాయని ఎల్వీ అనగానే, ఎందుకు అడ్డమొస్తారు, వాళ్లు పడే బాధలు మీకేం తెలుసంటూ వాయించేశారు. ఇక అంతే మళ్లీ ఈయన నోరెత్తితే ఒట్టు.
ఇక తర్వాత అజయ్ కల్లాం, పీవీ రమేష్ వంటి వారు సీఎంఓ ఆఫీసులో అపాయింట్ అయ్యారు. ఇంకా అనేకమంది సలహాదారుల పేరుతో ఎంటరయ్యారు. ఇక ఎక్కడ ఏం జరగాలనేది వాళ్లే చెబుతున్నారు. జగన్ కూడా చర్చించేది వాళ్లతోనే. అన్నీ అయిపోయాక ఫైల్ సీఎస్ దగ్గరికి వస్తుంది, సంతకం పెట్టడానికి. ఇలాంటి పరిస్ధితుల్లో వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ ఈ బ్యూరోక్రసీ పైత్యాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు.
మరోవైపు దేవాలయాల్లో పని చేసే అన్య మతస్థులను తొలగించాలని ఎల్వీ సుబ్రమణ్యమే జీవో ఇచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. అందుకే ఆయనపై జగన్ సీరియస్ అయ్యారంటున్నారు. అంటే సీఎస్, సీఎంకు సంబంధం లేకుండా అంతమంది ఉద్యోగులను తీసేస్తారా.. ఇది సాధ్యమేనా?
అధికారంలోకి రాక ముందే అధికారుల మధ్య జగన్ కులం చిచ్చు పెట్టారన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారంలోకి వచ్చాక ఆయన చేసిన ఆరోపణలనే రివర్స్ లో అమలు చేశారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ ఐదారునెలల్లో ఇప్పటికే నాలుగు సార్లు అధికారుల బదిలీలు చేశారు. అంటే మనం అర్ధం చేసుకోవచ్చు.. ఏ రేంజ్ లో కన్ ఫ్యూజ్ అవుతున్నారో.. అడ్మినిస్ట్రేషన్ ఎంత దారుణంగా ఫెయిలవుతుందో. ఈ పరిస్ధితే ప్రవీణ్ ప్రకాష్, ఎల్వీ సుబ్రమణ్యం మధ్య వివాదానికి దారి తీసింది. అదే ఇప్పుడు చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని అవమానకరంగా పంపడానికి కారణమైంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎలా నడిపినా, సీనియర్లను ఎంత అవమానించినా చివరికి అధికారంలోకి అయితే వచ్చారు కదా.. అందుకే ప్రభుత్వంలో కూడా అలాగే ఫాలో అయిపోతున్నట్లు కనపడుతోంది.