తెలుగు బిగ్ బాస్-3 మెగా స్టార్ చిరంజీవి చెప్పినట్టు ప్రపంచంలో టాప్ షో కాకపోవచ్చు…కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలను మూడు నెలలుగా బానే ఆకట్టుకుంది. ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఆఖరి నిమషం వరకు సస్పెన్స్‌గా నడిచింది.
అలీ రెజాకి అమ్మాయిల ఓట్లు తప్ప, షో లో తన స్పెషలిటీని ఎక్కడ చూపెట్టలేకపోవడంతో మిగతా ఓట్లు ఏమి పెద్దగా రాలేదు. దానితో షో గెలుస్తాడు అనే నమ్మకం తనకు కూడా ఎక్కడ ఉన్నట్టు అనిపించలేదు. అందుకే ఈనాటి ఫైనల్స్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి… టాప్ 5 స్థానంతో సరిపెట్టుకున్నాడు.
చాలా సార్లు టైటిల్ వరుణ్ సందేశ్ దే అనుకున్నా…అందరిని ఆశ్చర్యపరుస్తూ టాప్ 4 లోనే వరుణ్ ప్రయాణం ఆగిపోవాల్సివచ్చింది. తాను ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చాక… వితికతో పాటు అక్కడున్న మిగతా ప్లేయర్స్ కూడా కొంచం షాక్ అయ్యారు. జెంటిల్మాన్, మంచి వాడు, చాలా సున్నితమనస్కుడు అని అనిపించుకున్న వరుణ్ కి బానే ఆదరణ వచ్చింది. ముఖ్యంగా తన భార్యని చూసుకున్న విధానం చాలా మందికే నచ్చింది. కానీ, విన్నర్… లేదు రన్నర్ అవుతాడనుకున్న వరుణ్ ఓటింగ్ లో నిలవలేకపోయాడు.
బాబా భాస్కర్ అందరిని బానే అలరించినా…తమిళ్ వాడికి ఎందుకు తెలుగు టైటిల్ దక్కాలి అని సోషల్ మీడియాలో తెగ ప్రచారం సాగింది. మరి అందుకో, వేరే ఎదో కారణం వల్లనో టాప్ 3 వరకు మాత్రమే బాబా భాస్కర్ వెళ్లగలిగాడు.
టాప్ 5 లో మిగిలిన ఏకైక మహిళా కంటెస్టెంట్ శ్రీముఖి కోసం సోషల్ మీడియాలో ఎంతో ప్రచారం జరిగినా, అనూహ్యంగా రన్నర్-అప్ గా మిగిలిపోయింది. రాములమ్మ, మహానటి అనే పేరు సంపాదించుకున్నా… తనకోసం బయట ఎంతో ప్రచారం జరిగినా…అవన్నీ ఓట్లుగా మారలేదు. అల్లరి, ఆకతాయితనం, ఎనర్జీ ఉన్నా… ఎందుకో గెలవడానికి కావలసిన ఓట్లు మాత్రం దక్కించుకోలేకపోయింది. ఇంట్లో అడుగుపెట్టిన మొదటి క్షణం నుంచి ఎలా అయినా టైటిల్ కొట్టాలి అని గేమ్ ఆడిన శ్రీముఖి..ఆఖరికి రాహుల్ చేతిలో ఓడిపోయింది.
అసలు బిగ్ బాస్ సీజన్ టైటిల్ గనుక రాహుల్ సిప్లిగంజ్ గెలిస్తే బద్ధకం గెలిచినట్టే అని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరి బద్దకమే రాహుల్ ని గెలిపించిందా? లేదు ఇంకేమన్నా ఉందా? ఓట్ ప్రక్రియతో విజేతలు నిర్ణయింపబడతారు కాబట్టి అందరిని ఆకట్టుకోవడమే కాదు…మా ఇంట్లో వ్యక్తి అనే ఎమోషనల్ కనెక్ట్ ప్రేక్షకులతో ఏర్పరుచుకోవాలి. ఎవ్వరు ఊహించకపోవడమే రాహుల్ విజయానికి ఒక కారణం కావొచ్చు. అండర్ డాగ్ ని గెలిపించడం జనం కి నచ్చుతుంది…ఎప్పుడు బద్ధకంగా ఎదో ఒకటి ఆడదాము అన్నట్టు ఉంటూ, వీలైనంత ఎంటర్టైన్మెంట్ ఇస్తూ, ఒక సామాన్య మధ్య తరగతి అబ్బాయిగా రాహుల్ మనసులు గెలుచుకున్నాడు. అమ్మ-నాన్నకు ఒక చిన్న ఫ్లాట్ కొనాలి అనే ఆశ చాలా మంది మధ్యతరగతి ప్రేక్షకులకి అర్ధం అయ్యింది. తన అమ్మకు కొడుకుగా కూడా బానే మార్కులు కొట్టేసాడు. రాహుల్ విజయానికి ఒక ముఖ్య కారణం పునర్నవి భూపాలం…తన క్యూట్ లవ్ ట్రాక్ జనంకి నచ్చుతోంది అని తెలిసో, లేక నిజంగానే అలా ఫీల్ అయ్యాడో తెలియదు కానీ..ఆ పాయింట్ కూడా రాహుల్ గెలుపుకి పెద్ద కారణం అయ్యిందనే చెప్పుకోవాలి. ఏది ఏమయినా మన వాడే విజేత అని జనం ఫీల్ అయ్యేలా రాహుల్ మనసులు గెలుచుకున్నాడు.