క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్లను ఎన్నో రకాలుగా ఔట్ చేయవచ్చు. వాటిల్లో ఎల్‌బీడబ్ల్యూ కూడా ఒకటి. అయితే గతంలో అంపైర్లు అనేక సార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి క్రికెట్‌లో డెసిషన్ రివ్యూ సిస్టం (డీఆర్ఎస్)ను అమలులోకి తెచ్చారు. ఈ క్రమంలో అంపైర్లకు మరింత కచ్చితత్వంతో నిర్ణయాలను తీసుకునేందుకు వీలు కలుగుతోంది. అయితే ప్రస్తుతం డీఆర్ఎస్ ద్వారా ప్లేయర్లకు అంపైర్ల నిర్ణయాలను సవాల్ చేసే అధికారం లభిస్తోంది. కానీ డీఆర్ఎస్ ఎలా పనిచేస్తుందో ఇప్పటికీ కొందరు ప్రేక్షకులకు అర్థం కావడం లేదు. మరి అదెలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..?
సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లలో ప్లేయర్లు రివ్యూ కోరాక సాంకేతిక సిబ్బంది బాల్ ట్రాకర్‌తో అంపైర్‌కు తెర మీద అప్‌డేట్ ఇస్తారు. ఈ క్రమంలో 3 అంశాల ఆధారంగా డీఆర్ఎస్ ద్వారా ప్లేయర్ ఔట్ అయిందీ, కానిదీ నిర్దారిస్తారు. బంతి పిచ్‌పై ఏ ప్రాంతంలో ముందుగా పడింది, వికెట్ల లైన్‌లోనే బంతి ఉందా, వికెట్లను బంతి తాకుతుందా, లేదా అన్న 3 అంశాల ఆధారంగా బాల్ ట్రాకర్ వేస్తారు. ఈ క్రమంలో బంతి వికెట్ల లైన్‌లో కాకుండా బయటి వైపు ఉంటే అప్పుడు నాటౌట్ ఇస్తారు. అలాగే బంతి ముందుగా పడిన ప్రాంతాన్ని బట్టి అది బయటి వైపు పడిందా, లోపలి వైపా అన్నది చూసుకుని, బయటి వైపు అయితే అప్పుడు కూడా నాటౌట్ ఇస్తారు. అలాగే బాల్ ట్రాకర్‌లో బంతి వికెట్లను తాకడం లేదని తెలిసినా నాటౌట్‌గా ఇస్తారు.
ఇక పైన తెలిపిన 3 అంశాల్లోనూ బంతి సరిగ్గానే ఉంటే అప్పుడు ఔట్‌గా ప్రకటిస్తారు. అంటే బంతి లోపలి వైపు పడి వికెట్ల లైన్‌లో ఉండి వికెట్లను తాకేలా వెళ్తుంటే ఔట్ ఇస్తారు. అలా కాకుండా ఏ ఒక్క అంశం సరిగ్గా లేకున్నా పైన తెలిపిన విధంగా నాటౌట్ ఇస్తారు. ఇక అంపైర్ ఔట్ లేదా నాటౌట్ ఏది ప్రకటించినా.. డీఆర్ఎస్ తీసుకున్నాక రివ్యూలో అంపైర్స్ కాల్ అని వస్తే అప్పుడు థర్డ్ అంపైర్‌కు సంబంధం ఉండదు. గ్రౌండ్‌లో ఉన్న అంపైర్ తీసుకున్న నిర్ణయాన్నే ఫైనల్‌గా పాటిస్తారు. దీంతో అంపైర్ ఇచ్చిన ప్రకారం ప్లేయర్ ఔట్ లేదా నాటౌట్ అవుతాడు. ఇలా డీఆర్ఎస్‌ను అనుసరిస్తారు.
అయితే అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్లేయర్లు డీఆర్ఎస్ కోరితే అప్పుడు అంపైర్స్ కాల్ రాకుండా ఏది వచ్చినా రివ్యూ కోరిన టీం విన్ అయితే వారికి ఇంకా రివ్యూలకు చాన్స్ ఉంటుంది. అదే లూజ్ అయితే వారు ఆడే మ్యాచ్‌లను బట్టి రివ్యూలు వర్తిస్తాయి. ఇక అంపైర్స్ కాల్ వస్తే టీం రివ్యూను విన్ అవకపోతే రివ్యూను కోల్పోదు. రివ్యూ అలాగే ఉంటుంది. ఈ విధంగా డీఆర్ఎస్ రూల్స్ పాటిస్తారు.