ఇతర దేశాల్లో పరిస్థితి ఏ విధంగా ఉందో గాని మన దేశంలో మాత్రం ఫోన్ లేకపోతే మనిషికి పిచ్చి పట్టే పరిస్థితి ఉందనే మాట వాస్తవం. దాదాపు ప్రతీ ఒక్కరు కూడా ఫోన్ తోనే అన్ని విధాలుగా కలిసి బ్రతికే పరిస్థితి ఉంది. తాజాగా విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే మన దేశంలో గత ఏడాది ప్రజలు ఫోన్ వాడిన గంటలు చూసి నిపుణులు సైతం షాక్ అవుతున్నారు. మొబైల్ వినియోగంలో, భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది.
2021లో 69,000 కోట్ల గంటలను ఫోన్‌లో ఖర్చు చేసింది మన దేశం. కరోనా దెబ్బకు ప్రతీ ఒక్కరు ఫోన్ మీదనే ఆధారపడే పరిస్థితి తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని కొత్త డిజిటల్ యుగంలోకి నడిపించింది. ఆఫీస్ మీటింగ్‌లు ఇప్పుడు కాన్ఫరెన్స్ రూమ్‌లకు బదులుగా మొబైల్ ఫోన్‌లలోనే అన్నీ పూర్తి చేసే పరిస్థితి వచ్చింది. సినిమాలు, ఆర్ధిక లావాదేవీలు దాదాపుగా అన్నీ ఫోన్ నుంచే నడిపే పరిస్థితి వచ్చింది. యాప్ డేటా అనలిటిక్స్ సంస్థ విడుదల చేసిన లెక్కల ప్రకారం చూస్తే ప్రజలు ఎక్కువగా ఫోన్ లోనే గడిపారు.
స్టేట్ ఆఫ్ మొబైల్ 2022 నివేదిక ప్రకారం, భారతీయులు తమ మొబైల్ ఫోన్‌లలో 69,000 కోట్ల గంటలు గడిపారు. 1,11,000 కోట్ల గంటల మొబైల్ వినియోగంతో చైనా ప్రజలు మొదటి స్థానంలో నిలిచారు. 11,000 గంటలతో అమెరికా మూడో స్థానంలో ఉంది. నివేదిక యొక్క డేటా ప్రకారం, ప్రతి భారతీయుడు 2021లో ప్రతిరోజూ సగటున 4.7 గంటలు తమ మొబైల్ ఫోన్‌లలో గడిపారు. రోజుకు మొబైల్ వినియోగంలో, బ్రెజిల్ మరియు ఇండోనేషియా (5.4 గంటలు), దక్షిణ కొరియా (5 గంటలు) మరియు తర్వాత భారతదేశం నాల్గవ స్థానంలో నిలిచింది.