తిరుమల తిరుపతి వెళ్లాలని చాలా మందికి ఒక కల. ఎన్ని సార్లు వెళ్ళినా మరోసారి వెళ్లాలని తపిస్తూ ఉంటారు. గంటల తరబడి లైన్ లో నిలబడినా సరే… అక్కడికి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తారు. అసలు తిరుపతి నుండి తిరుమల కొండకు కాలిదారిన వెళ్ళడానికి ఎన్ని దారులు ఉన్నాయనేది చాలా మందికి తెలియదు. చాలా మంది చెప్పే ప్రకారం… 4 దారులు ఉన్నాయట.
1) అలిపిరి, 2) శ్రీవారి మెట్టు. 3) అన్నమయ్య దారి… ఇది స్వామి పాదాల దారి. కడప నుంచి మొదలవుతుంది. 4) దేవరకొండ దారి ఉంది. ఇది కర్ణాటక రాష్ట్రం నుంచి. అయితే సప్తగిరి సంచికలలో మొత్తం 8 దిక్కుల నుంచి తిరుమలకు దారులు ఉన్నట్టుగా టి.టి.డి పేర్కొంది. కాని వాటిల్లో ఏ ఒక్కటి కూడా ఉపయోగంలో లేవు. వాటిల్లో చాలా వరకు దట్టమైన అడవి మార్గం నుండి రావాల్సి ఉంటుంది.
Also Read: భోజనం తర్వాత అరటి పండు తినడం మంచిది కాదా…?
అన్నమయ్య దారి కూడా దట్టమైన అడవి మార్గంలో నుంచి వెళ్ళాలి. ఈ దారిలో ఏ విధమైన సదుపాయాలను ఏర్పాటు చేయలేదు. అన్నమయ్య దారి కడప జిల్లాలోని కోడూరు మండలంలోని కుక్కలదొడ్డి గ్రామం నుంచి ఉంటుంది. వర్షాకాలం, ఎండాకాలం వెళ్ళడం సాధ్యం కాక చాలా మంది చలికాలంలో వచ్చే వారు. కుక్కలదొడ్డి గ్రామం తిరుపతి నుంచి 40 కిలోమీటర్లు ఉంటుంది. వెంకటగిరి నుంచి 30 కి.మీ దూరం ఉంటుంది.
తిరుపతి లోని రేణిగుంటలోని మామాండూరు లో ఉండే కేశవ రెడ్డి విద్యా సంస్థలు దాటిన తర్వాత అన్నమయ్య దారి మొదలవుతుందట. లేదంటే కోడూరు నుంచి ఒక దారి ఉంది. కోడూరు కి రైల్వే స్టేషన్ సదుపాయం ఉంది. ఇప్పుడు రెండు దారులు మాత్రమే భక్తులకు అనుకూలంగా ఉన్నాయి. అలిపిరి నుంచి వెళ్ళే మార్గం ఒకటి. ఇది దూరం కొంచం ఎక్కువగా ఉన్నా సరే… 24 గంటల సదుపాయాలు ఏర్పాటు చేసారు.
ఇక శ్రీవారి మెట్టు మార్గం కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అంటారు. శ్రీనివాస మంగాపురం దాటి వెళితే, ఈ దారిలో మొదటి మెట్టు కనపడుతుంది. మెట్లు తక్కువే ఉంటాయి గాని… ఈ దారిలో వెళ్ళాలి అంటే సొంత వాహనాలలో వెళ్ళకుండా ఉండటం మంచిది. సాయంత్రానికి… మెట్ల దారి, శ్రీనివాస మంగాపురం నుండి ఈ మెట్లకు వెళ్ళే రోడ్డు రెండింటిని మూసి వేయడంతో దర్శనం ఆలస్యం అవుతుంది. అడవి ఉంటుంది కాబట్టి మూసి వేయడం జరుగుతుంది. వాహనాలు అక్కడి నుంచి తిరిగి వెళ్ళడానికి అనుమతి ఉండదు.