ఎన్నికల సమయంలో ప్రకటనలు, ప్రచారాలపై ఏయే పార్టీలు ఎంత ఖర్చు చేశాయనే విషయంపై ఎన్నికల సంఘం ఓ నివేదికను విడుదల చేసింది. ప్రకటనలపై అధికార బీజేపీ అధికంగా ఖర్చు చేసినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఎన్నికల సంఘానికి ఆయా పార్టీలు పంపిన లెక్కల ఆధారంగా ఈ నివేదికను ఎన్నికల సంఘం ప్రకటించింది.
2021-22 ఆర్థిక సంవత్సరంలో బీజేపీ పార్టీ అత్యధికంగా ప్రచారం, ప్రకటనలపై రూ. రూ.313.17 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది. ఇందులో 75 శాతం ఖర్చును ఎన్నికలు, సాధారణ ప్రచారానికి పార్టీ వినియోగించినట్టు ఎన్నికల సంఘం పేర్కొంది. ఇందులో ప్రకటనల కోసం రూ.164 కోట్లు, ఆడియో, వీడియోల కోసం రూ.18.41 కోట్లు, ఎలక్ట్రానిక్ మీడియా కోసం రూ.72.28 కోట్లు ఖర్చు చేసినట్టు నివేదిక వెల్లడించింది.
దీంతో పాటు కటౌట్లు, హోర్డింగ్‌లు, బ్యానర్ల కోసం రూ.36.33 కోట్లు, రూ. 22.12 కోట్లను కరపత్రాల ప్రకటనల కోసం వెచ్చించినట్టు నివేదిక స్పష్టం చేసింది. పార్టీ చేసిన మెుత్తం ఖర్చుల్లో 37 శాతాన్ని ప్రకటనలు, ప్రచారం కోసం కాషాలయ పార్టీ ఖర్చు చేసినట్టు పేర్కొంది.
మరోవైపు టీఎంసీ పార్టీ రూ.268.33 కోట్లు ఖర్చుపెట్టినట్లు తెలిపింది. ఆ పార్టీ చేసిన మొత్తం ఖర్చులో ఇది కేవలం 11 శాతం మాత్రమేనని పేర్కొది. బీఎస్పీ రూ.85.17 కోట్లు, తమిళనాడులోని అధికార డీఎమ్‌కే పార్టీ మెుత్తం రూ.35.40 కోట్లు ప్రకటనలు, ప్రచారం ఖర్చు చేసింది.
ఆ పార్టీ చేసిన మెుత్తం వ్యయంలో 97 శాతం ప్రకటనలు, ప్రచారం కోసం ఖర్చు చేసింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 2021-22లో మెుత్తం ప్రకటనల నిమిత్తం రూ. 30.29 కోట్లు ఖర్చు పెట్టింది. ఈ మెుత్తం ఆ పార్టీ ఖర్చులో 46 శాతానికి సమానం. ప్రతిపక్ష అన్నా డీఎంకే.. ప్రచారం, ప్రకటనల కోసం రూ.28.43 కోట్లు ఖర్చు చేసిందని చెప్పింది.
బిజూ జనతా దళ్ రూ.28.63 కోట్లు, ఏపీలో టీడీపీ రూ.25.57 కోట్లు, సమాజ్ వాది పార్టీ రూ. 7.56 కోట్లు, బీఆర్ఎస్ రూ.7.12 కోట్లు, జేడీయూ రూ.4.15 కోట్లు, ఆర్జేడీ రూ. 33వేలు వెచ్చించినట్లు తెలిపింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన వార్షిక ఆడిట్ నివేదికల ప్రకారం ఎన్సీపీ, వైఎస్ఆర్సీపీ, సీపీఐలు ప్రకటనలపై ఎలాంటి ఖర్చులు చేయలేదు. ఇక ఈసీఐకి కాంగ్రెస్, సీపీఎం పార్టీలు ఖర్చుల వివరాలను అందించలేదు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కాంగ్రెస్ పార్టీ రూ.279.73 కోట్లు, సీపీఎం రూ.83.41 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.