ఆరఆర్ ఆర్ మూవీలో రామ్ చరణ్, జూనియర్ ఎన్ఠీఆర్ ‘నాటు నాటు’ పాటకు వేసిన స్టెప్పులు, చేసిన డ్యాన్స్ అంతర్జాతీయంగా క్రేజ్ సృష్టించింది. ఈ మాస్ బీట్ కి అన్ని భాషల ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. చాలామంది తామూ అలాగే డ్యాన్స్ చేయడానికి ప్రయత్నించారు. ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ వహించిన ఈ సాంగ్ కి స్టెప్పులు వేస్తూ మాస్ ఆంథెమ్ హ్యాష్ ట్యాగ్ తో తమ వీడియోలను పోస్ట్ చేశారు. ఇందులో ముఖ్యంగా హుక్ స్టెప్ సీక్రెట్ గురించి ఒక సందర్భంలో ప్రేమ్ రక్షిత్ కూడా వివరించాడు.
ఇదే సమయంలో ఓ మలయాళీ దినపత్రిక సైతం ఈ పాటకు స్టెప్స్ ఎలా వేయాలో డీటెయిల్ గా ఓ ‘ట్యుటోరియల్’ వంటి దాన్ని ప్రచురించింది. ఈ పాటను చిత్రీకరించడానికి దీన్ని మూడు భాగాలుగా డివైడ్ చేశారట. హుక్ స్టెప్స్ పేరిట మొదట కాళ్లను ఎలా ముందుకీ, వెనుకకూ కదిలించాలో, అలాగే తలను ఎలా తిప్పాలో, సెకను కాలంలో ఎన్ని స్టెప్పులు వేయాలో ఈ పత్రిక ఇలస్టేషన్లతో సహా క్లిప్పింగ్ ని పబ్లిష్ చేసింది.
ఈ పాట లోని ‘నాటు నాటు’ అన్న పదాలే గ్రామీణ భారతాన్ని ప్రతిబింబిస్తున్నాయి. తక్కువ పదాలతో ఎక్కువ కొరియోగ్రఫీకి ఇది నిదర్శనంగా నిలిచింది. ఇది కేవలం డ్యాన్సే కాదు.. శరీరంలోని అన్ని అవయవాలనూ క్షణ కాలంలో ఎలా మెరుపులా కదిలించాలో, అదే సమయంలో ముఖ భంగిమలను ఎలా అతి వేగంగా మార్చాలో చూపిన ‘నాటు నాటు’ పాట ఇది !
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డును దక్కించుకుని తెలుగువాడి సత్తాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన ఈ సాంగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే ! ఇండియాలో జాతీయ పత్రికలు ఈ పాటను హైలైట్ చేసి అద్భుత విశ్లేషణలు చేస్తే.. స్థానిక పత్రికలు మాత్రం ఎందుకు పెద్దగా స్పందించలేదని ఓ ట్విట్టర్ యూజర్ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ క్లిప్పింగ్ ని షేర్ చేశారు.