దేశవ్యాప్తంగా రెండో విడత కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. 60 ఏళ్లు వయసుపై బడినవారు, అలాగే 45-59 ఏళ్ల మధ్య ఉండి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి ఈ విడతలో వ్యాక్సిన్ వేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే కొద్ది రోజుల పాటు కోవిన్(ccovin) యాప్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నవారికి మాత్రమే వ్యాక్సిన్ వేయనున్నారు. దీంతో వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకోవాలంటే ఏయే ధ్రువపత్రాలు అవసరమన్న విషయంపై చాలా మందికి అవగాహన లేదు.60 ఏళ్లు దాటిన వారు ఆధార్ కార్డు, పాన్‌కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరుకార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఏదో ఒక గుర్తింపు కార్డును ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైన 45-59 ఏళ్ల వారు మాత్రం.. తాము వ్యాధితో బాధపడుతున్నట్లుగా.. డాక్టర్ ఇచ్చిన సర్టిఫికేట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకునే సమయంలో వాటి ఒరిజనల్స్‌ను చూపించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్న అనంతరం.. లబ్ధిదారుడు ఏ తేదిన, ఏ సమయానికి వ్యాక్సినేషన్ కేంద్రానికి వెళ్లాలో సమాచారం వస్తుంది. మొదటి డోసు ఇచ్చిన సమయంలోనే రెండో డోసు కోసం ఎప్పుడు రావాలో ఆరోగ్య కార్యకర్తలు వివరిస్తారు.