క్రికెట్ మ్యాచ్‌లలో ఆడడం ప్లేయర్లు వంతు అయితే నిర్ణయాలను ప్రకటించడం అంపైర్ల వంతు. మ్యాచ్‌లలో అంపైర్లు ప్రతి క్షణం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా చిన్న విషయాన్ని కూడా సరిగ్గా పరిశీలించకపోతే అందుకు ప్లేయర్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అంపైర్లు చేసే తప్పిదాల వల్ల, వారు ప్రకటించే తప్పుడు నిర్ణయాల వల్ల కొన్ని సార్లు మ్యాచ్ స్థితి గతులే మారిపోతాయి. విన్నర్లు కావల్సిన వారు ఓడిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటి వరకు అనేకం జరిగాయి. కనుక క్రికెట్ మ్యాచ్‌లకు అంపైరింగ్ చేయడం అంటే.. అంత ఆషామాషీ ఏమీ కాదు.. అనే చెప్పవచ్చు.
క్రికెట్ మ్యాచ్‌లలో ప్రస్తుతం డీఆర్ఎస్ ను ఉపయోగిస్తున్నారు కదా. అయితే అంపైర్లు ఇచ్చిన నిర్ణయాన్ని సవాల్ చేసే అధికారం ప్లేయర్లకు ఉంటుంది. ఈ క్రమంలో వారు డీఆర్ఎస్ తీసుకోగానే ఫీల్డ్ అంపైర్ కు వ్యతిరేకంగా నిర్ణయం వస్తే అప్పుడు ఆ అంపైర్‌కు ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది. తాను తప్పు చేశామోనన్న భావన కలుగుతుంది. ఇది వారి మానసిక స్థితిపై తద్వారా మ్యాచ్‌పై ప్రభావం చూపిస్తుంది.
ఇక బ్యాట్స్‌మెన్లు కొట్టే బంతులను లేదా ప్లేయర్లు విసిరే బంతులను అంపైర్లు తప్పించుకోవాలి. అందుకు వారు మ్యాచ్ జరిగిన ఆద్యంతం అప్రమత్తంగానే ఉండాలి. అలాగే నో బాల్స్ ను కూడా చెక్ చేయాలి. గతంలో ఫీల్డ్ అంపైర్లే నో బాల్స్‌ను ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఆ బాధ్యతను థర్డ్ అంపైర్‌కు ఇచ్చారు. అయినప్పటికీ ఫీల్డ్ అంపైర్‌కు మ్యాచ్ జరిగినంత సేపు కత్తి మీద సాము లాగే ఉంటుంది. ఎలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నా అది మ్యాచ్ స్థితినే మార్చేస్తుంది.
సైమన్ టొఫెల్:
ఒకసారి సచిన్ సెంచరీకి దగ్గరగా ఉన్నప్పుడు అంపైర్ సైమన్ టొఫెల్ సచిన్‌ను ఓ బంతికి ఔట్ అని ప్రకటించాడు. కానీ రీప్లేలో అది నాటౌట్ అని తేలింది. అయినప్పటికీ సచిన్‌ను ఔట్ అని ప్రకటించారు కనుక సచిన్ పెవిలియన్‌కు వెళ్లక తప్పలేదు. అయితే మరుసటి రోజు టొఫెల్ సచిన్‌ను కలిసి తన విచారం వ్యక్తం చేశాడట. నిన్నటి మ్యాచ్‌లో నేను నిన్ను తప్పుగా ఔట్ అని ఇచ్చాను, నీకు తెలుసా ? అని సచిన్‌ను అతను అడిగాడు. అందుకు సచిన్ ఫర్వాలేదు, ఆటలో ఇవన్నీ సహజమే, రిలాక్స్ అని బదులిచ్చాడట.
కుమార ధర్మసేన:
2019లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గుర్తుండే ఉంటుంది. అంపైర్ కుమార ధర్మసేన తప్పుడు నిర్ణయం వల్ల ఇంగ్లండ్ జట్టుకు 5 పరుగులకు బదులు 6 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. అది కూడా టై అయింది. దీంతో బౌండరీలు ఎక్కువగా కొట్టిన ఇంగ్లండ్‌కు వరల్డ్ కప్ ప్రకటించారు. అంపైరింగ్ తప్పిదం వల్ల న్యూజిలాండ్ అలా ఏకంగా వరల్డ్ కప్‌నే కోల్పోవాల్సి వచ్చింది.
ఆర్‌సీబీ వర్సెస్ ఎంఐ:
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌కు మధ్య జరిగిన ఓ మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 1 బంతికి 7 పరుగులు చేయాల్సి ఉంది. మలింగ చివరి బంతి వేశాడు. అయితే అది నో బాల్. కానీ అంపైర్ దాన్ని నో బాల్‌గా ప్రకటించలేదు. దీంతో బెంగళూరు 6 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఇదే విషయాన్ని ప్రెస్ మీట్‌లో చెప్పాడు. అంపైరింగ్ తప్పిదం వల్ల తమకు నష్టం జరిగిందన్నారు. కానీ అదే నో బాల్‌ను ప్రకటించి ఉంటే ఇంకో బంతికి సిక్స్ కొట్టి ఉంటే బెంగళూరు గెలిచి ఉండేది. ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయి ఉండేది. కానీ వారి దురదృష్టం. అలా జరిగింది.
ఇలా అంపైర్లు చేసే తప్పిదాల వల్ల కొన్ని సార్లు స్వల్ప నష్టాలే జరిగినా, వరల్డ్ కప్ లాంటి టోర్నమెంట్లలో తప్పిదాలు చేస్తే ఏకంగా కప్‌నే కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అంపైర్లకు అన్ని వర్గాల వారి నుంచి విమర్శలు వస్తాయి. కనుక అంపైరింగ్ అనేది అంత ఈజీ జాబ్ ఏమీ కాదు. అత్యంత సవాల్‌తో కూడుకున్న పని అని చెప్పవచ్చు.