లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి ముఖానికి రంగేసుకున్నాడు సీనియర్ నటుడు వేణు తొట్టెంపూడి. ఇంతకీ ఈ సినిమా కోసం అతడ్ని దర్శకుడు శరత్ ఎలా సంప్రదించాడు? వేణు తొలి రియాక్షన్ ఏంటి? చదివేయండి..
రామారావు ఆన్ డ్యూటీలో కీలక పాత్ర అనుకున్న వెంటనే వేణు తొట్టెంపూడిని తీసుకోవాలని దర్శకుడు అనుకున్నాడు. తెలిసిన వాళ్ల ద్వారా సంప్రదించాడు. తనను ఇంకా గుర్తుంచుకున్నందుకు థాంక్స్ చెప్పిన వేణు.. నటించే ఇంట్రెస్ట్ లేదని ఆ ప్రపోజల్ ను పక్కన పెట్టేశాడు.
అయినప్పటికీ దర్శకుడు వదల్లేదు. ఈసారి నేరుగా అతడే రంగంలోకి దిగాడు. వేణును వాట్సాప్ లో సంప్రదించాడు. క్యారెక్టర్ డీటెయిల్స్ కొద్దిగా చెప్పాడు. కథ విని నో చెప్పమన్నాడు. దీంతో వేణు బ్రేక్ ఫాస్ట్ కు పిలిచాడు. అలా అరగంటలో బ్రేక్ ఫాస్ట్ టైమ్ లో శరత్ ను వెనక్కి పంపించేయాలనేది వేణు ప్లాన్. కానీ.. శరత్ మాత్రం తన నెరేషన్ తో గంటన్నర కూర్చోబెట్టాడు.
వేణుకు స్టోరీ, అందులో తన పాత్ర బాగా నచ్చింది. వెంటనే మరుసటి రోజు కలుద్దాం అని చెప్పాడు. ఈసారి లంచ్ కు కలిశారు. ఈసారి ఫుల్ నెరేషన్ ఇచ్చాడు దర్శకుడు. అంతే వెంటనే సినిమాకు ఓకే చెప్పాడు వేణు. ఇలా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలోకి ఎంటరయ్యాడు.
నిజానికి ఈ సినిమా కంటే ముందు చాలామంది వేణును సంప్రదించారట. అయితే.. ఇంకా తనను జనాలు చూస్తారా అనే అనుమానంతో అన్నింటినీ తిరస్కరిస్తూ వచ్చాడంట. ఆ అనుమానాల్ని దర్శకుడు శరత్ మండవ పటాపంచలు చేశాడట. అందుకే రవితేజ సినిమాలో నటించడానికి అంగీకరించానని తెలిపాడు వేణు.