యూఏఈ, యమన్ హౌతీ తిరుగుబాటు దారులు మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోసారి హౌతీ తిరుగుబాటు దారులు క్షిపణి దాడి చేశారు. అయితే ఈ దాడులను యూఏఈ తిప్పికొట్టినట్టు ప్రకటించింది. యూఏఈ పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ను టార్గెట్ చేస్తూ దాడులు చేసినట్టు అబుదాబి అధికారిక వర్గాలు భావిస్తున్నాయి. అబుదాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయెద్ను ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ కలిశారు. హౌతీ తిరుగుబాటుదారులు యూఏఈపై చేస్తున్న దాడులను తాము ఖండిస్తున్నట్టు ఐజాక్ హెర్జోగ్ చెప్పారు. యూఏఈ భద్రతకు తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
ఈ దాడులపై స్పందించిన యూఏఈ.. హౌతీ ఉగ్రవాదులు కవ్వింపు చర్యలకు తరచూ పాల్పడుతున్నారని.. ప్రతీది పరిశీలిస్తున్నామని చెప్పారు. తాజాగా చేసిన క్షిపణి దాడిని ఎదుర్కొన్నామని తెలిపారు. శకలాలు జనావాసాలకు దూరంగా పడడం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని వెల్లడించారు. ప్రతిదాడులకు తాము కూడా సిద్ధమేనని హెచ్చరించారు. తాజాగా జరిగిన దాడులకు సంబంధించిన ఫోటోలను విడుదల చేశారు.
ఇటీవల హౌతీ తిరుగుబాటుదారులు అబుదాబి ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ పై బాంబ్ దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. దీనికి ప్రతిదాడిగా సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు యమన్ పై మెరుపు దాడులు చేశారు. దీంతో.. యమన్ జైల్ లో 100 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటన తరువాత హౌతీ వరుసగా రెండు సార్లు క్షిపణి దాడులు చేసింది. తాజాగా జరిగిన పేలుళ్లకు హౌతీ ఉగ్రవాదులు బాధ్యత వహిస్తూ ప్రకటన జారీ చేసింది.
ఈ ఘర్షణలు ఇప్పటివి కాదు. హౌతీ తిరుగుబాటుదారులు 2014లో యెమెన్ రాజధాని సనాను ఇరాన్ సహకారంతో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అప్పటినుంచి సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు వీరితో పోరాడుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన పరస్పర దాడుల్లో వేలాది మంది ప్రజలు బలయ్యారు.