చార్ ధామ్ హై పవర్ కమిటీ(హెచ్ పీసీ) చైర్మన్ పదవికి రవి చోప్రా రాజీనామా చేశారు. ప్యానెల్ అధికార పరిధిని రెండు నాన్ డిఫెన్స్ రోడ్ల పర్యవేక్షణకు పరిమితం చేస్తు కోర్టు ఇచ్చిన ఆదేశాలు తనకు అసంతృప్తిని కలిగించాయని అన్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్ కు ఆయన రాజీనామా లేఖను పంపారు.
ఇందులో సుప్రీం కోర్టు 2021 డిసెంబర్ లో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా హిమాలయాల్లో రోడ్ల వెడల్పు చేసేందుకు సుప్రీం కోర్టు అనుమతులు ఇచ్చిందని, దీని కోసం గతంలో హెచ్ పీసీ ప్రతిపాదనలను పక్కకు పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
‘ సుప్రీం కోర్టు ఆదేశాలు హెచ్ పీసీ పాత్రను కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం చేసింది. అది కూడా కేవలం రెండు రక్షణేతర రహదారులకు మాత్రమే పరిమితం చేయడం బాధించింది. గతంలో హెచ్ పీసీ ఇచ్చిన ఆదేశాలు,సిఫార్సులను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విస్మరించింది లేదా ఆలస్యంగా స్పందించింది. ఇలాంటి అనుభవాన్ని చూసినప్పుడు మిగతా రెండు రెండు నాన్-డిఫెన్స్ రోడ్‌లకు సంబంధించి మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన భిన్నంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు” అని అన్నారు.
‘ నాన్-డిఫెన్స్ హైవేల విస్తరణ కోసం న్యాయపరంగా ఉపశమనం పొందేందుకు ప్రతివాదులకు న్యాయస్థానం అనుమతినిచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ పీసీకి అధిపతిగా కొనసాగడంలో లేదా అందులోభాగంగా ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం నాకు కనిపించడం లేదు” అని లేఖలో తెలిపారు.