వాళ్ళిద్దర్నీ చూసిన ఎవరికైనా, శత్రుదేశాలకు చెందిన నటీ నటులనే అభిప్రాయం కలగదు. ఒక దేశం నుంచి వచ్చనభావం కలుగుతుంది. ఇరు దేశాల మధ్య ఉండే సరిహద్దు విరోధాలేవీ వాళ్ళల్లో కనిపించలేదు. మొహాలు చిట్లించుకున్నట్టు లేదు, మోహమాటానాకి నవ్వినట్టూ లేదు, అది స్వచ్చమైన చిరునవ్వు. అది నవ్వు మాత్రమే కాదు. వికసించిన వ్యక్తిత్వాల్లోంచి వచ్చిన మానవత్వ పరిమళం. ఆ నవ్వులకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, పాకిస్తానీ హీరోయిన్ మహీరా ఖాన్ లు పక్కపక్కన కూర్చున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా జరుగుతున్న ‘రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022’లో భారత్ నుంచి హృతిక్ రోషన్ సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. డిసెంబరు 1న మొదలైన ఈ సినీ వేడుక రేపటి ( డిసెంబరు 10) వరకు కొనసాగనుంది.
ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పక్కపక్కనే కూర్చున్న హృతిక్ రోషన్, మహీరా ఖాన్ చిరునవ్వులు చిందిస్తూ ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. బ్లాక్ జాకెట్ లోపల వైట్ షర్ట్ ధరించి హృతిక్ డైనమిక్ గా కనిపించగా.. స్లీవ్ లెస్ గోల్డెన్ కలర్ గౌన్ లో మహీరా ఖాన్ మెరిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ఒక వ్యక్తి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్స్ వివిధ కామెంట్స్ చేశారు.
‘‘ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో..’’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘‘రెండు దేశాలకు చెందిన ఇద్దరు సూపర్ స్టార్లు సరిహద్దులు చెరిపేసి ఒకే వేదికపై తళుక్కుమన్నారు’’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొంటున్న సినీ సెలబ్రిటీల జాబితాలో షారుఖ్ ఖాన్, రణ్ బీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా ఉన్నారు.