ఓ దిగ్గజ బ్యాంక్ కుప్పకూలి దివాలా తీస్తే.. దాన్ని తలదన్నే మరో దిగ్గజ బ్యాంక్ ముందుకొచ్చి దాన్ని చీప్ రేటుకు కొని పారేసింది. బ్యాంకింగ్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని సృష్టించింది. ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి.. పూర్తిగా చేతులెత్తేసి మూత పడిన స్థితికి చేరుకున్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్ ని యూరప్ లోనే అతి పెద్ద బ్యాంక్ గా కొనసాగుతున్న హెచ్ఎస్ బీసీ ఆపద్బాంధవిలా నేనున్నానంటూ ఆదుకుంది. యూకే సబ్సిడియరీ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంకును కేవలం ఒకే ఒక్క పౌండుతో కొనేసిందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇది భారతీయ కరెన్సీలో 99 రూపాయలయితే.. డాలర్లతో పోలిస్తే 1.21 డాలర్ విలువ మాత్రమే..
ఈ బ్యాంక్ దివాలా స్థితికి చేరుకోవడంతో ముఖ్యంగా అమెరికాకు చెందిన బడా బాబులంతా తమ డిపాజిట్లను మరే ఇతర బ్యాంకులోనైనా డిపాజిట్ చేయాలా అని తర్జన భర్జన పడుతున్న సమయంలో వీరికి ‘రక్షణ’గా హెచ్ఎస్ బీసీ బ్యాంక్ .. ఈ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 2.9 ట్రిలియన్ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అతి పెద్ద బ్రిటిష్ టెక్ లెండర్ అయిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు కథ మొత్తానికి సుఖాంతమైంది.
ప్రభుత్వానికి, రెగ్యులేటర్లకు, కొనుగోలు దారులకు మధ్య జరిగిన వీకెండ్ చర్చలు ఫలించాయి. ఎస్వీబీ బ్రిటన్ కస్టమర్లు ..ఈ డీల్ తో ఇక సంతృప్తి చెందవచ్చునని .. వారి డిపాజిట్ల సేఫ్టీకి ఢోకా ఉండదని బ్రిటన్ ఆర్ధిక మంత్రి జెరెమీ హంట్ ప్రకటించారు. మా అతిముఖ్యమైన కంపెనీలు, సంస్థల్లో కొన్ని తుడిచిపెట్టుకుపోయే స్థితికి చేరుకుంటున్నాయని, అది మాకు అత్యంత ప్రమాదకరమైన పరిణామాలను సృష్టించిందని ఆయన అన్నారు.
బ్రిటిష్ టెక్నాలజీ సంస్థలు ఇక కుప్పకూలకుండా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా తామీ సేల్ వ్యవహారాన్ని ముందుండి నడిపించినట్టు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ వెల్లడించింది. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కు సుమారు 5.5 బిలియన్ పౌండ్ల రుణాలు, దాదాపు 6.7 బిలియన్ డాలర్ల డిపాజిట్లు ఉన్నాయని, తామీ బ్యాంకును తక్షణమే స్వాధీనం చేసుకుంటున్నామని హెచ్ఎస్ బీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నోయెల్ క్విన్ తెలిపారు. ఎక్సలెంట్ స్ట్రాటెజిక్ సెన్స్ తో ఈ డీల్ కుదిరిందన్నారు. మొత్తానికి సిలికాన్ వ్యాలీ బ్యాంక్ డిపాజిట్ దారులకు పూర్తి భద్రత ఉందన్నారు.