కరోనా వ్యాప్తి ఇంకా ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ప్రపంచ వ్యాప్తంగా 110 దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని పేర్కొంది. ఈ మహమ్మారి వివిధ రూపాల్లో మార్పు చెందుతోందని డబ్ల్యూహెచ్వో అధిపతి టెడ్రోస్ తెలిపారు.
కరోనా పరీక్షలను తగ్గించివేయడంతో కేసుల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నట్టు లెక్కలు తెలియట్లేదని వివరణ ఇచ్చారు. కొత్త కేసుల నమోదు, ఏఏ వేరియంట్లు వ్యాప్తిలో ఉన్నాయనే విషయాలను తెలుసుకునే జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలను దేశాల ప్రభుత్వాలు తగ్గించాయని పేర్కొన్నారు.
దీనివల్ల వైరస్ వ్యాప్తిని తగిన విధంగా గుర్తించలేదని పరిస్థితి ఏర్పడిందని వివరించారు టెడ్రోస్. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లతో పాటు.. భవిష్యత్తులో తలెత్తబోయే వేరియంట్లను విశ్లేషించడం కష్టంగా మారుతోందని తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు బీఏ4, బీఏ5లు ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపుతున్నాయని. దీని కారణంగా అత్యధికంగా కేసులు పెరుగుతున్నాయని టెడ్రోస్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా టీకాల లక్ష్యం నెరవేరలేదని వ్యాఖ్యానించారు. దీనివల్లే వైరస్ వ్యాప్తి చెందుతోందన్నారు. ప్రపంచ దేశాలన్ని 70 శాతం మంది జనాభాకు టీకా వేయాలని సూచించినప్పటికీ.. అల్పాదాయ దేశాల్లో ఇంకా అర్హులకు టీకాలు అందలేదని పేర్కొన్నారు. 58 దేశాలు మాత్రమే 70 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాయని వివరించారు. పిల్లలు, గర్భిణులు, రోగ నిరోధకశక్తి తక్కువ ఉన్న వ్యక్తులకు ఇంకా ముప్పు పొంచి ఉందని హెచ్చరించారు టెడ్రోస్.