తుని: ఓ పేద పురోహితుడు ముప్పయేళ్ల పాటు పౌరోహిత్యం ద్వారా కూడబెట్టిన రూ.లక్షల సొమ్ము ఆయన చనిపోయాక బయటపడింది. ఈ ఆసక్తికర ఘటన తూర్పుగోదావరి జిల్లా తునిలో వెలుగుచూసింది. పట్టణంలోని ముక్తిలింగయ్యగారి వీధిలో ఉండే అప్పల సుబ్రహ్మణ్యం (70) అనారోగ్యంతో మృతిచెందారు. ఆయన బంధువులు, పిల్లలు ఎవరూ అందుబాటులో లేకపోవటంతో స్థానికులు కొందరు బంధువులకు సమాచారం ఇచ్చి, బుధవారం మృతదేహాన్ని ఖననం చేశారు. తరువాత సుబ్రహ్మణ్యం చాలాకాలంగా నివాసం ఉన్న పాడుపడ్డ భవనాన్ని పరిశీలించారు. అక్కడ అనేక మూటలు కనిపించడంతో విప్పిచూశారు. వాటిల్లో భారీగా నగదు ఉండటంతో ముక్కున వేలేసుకున్నారు. మూటలు విప్పి లెక్కించడం ప్రారంభించారు. ఎంతకూ తరగకపోవటంతో కౌంటింగ్ మిషన్‌ను తెచ్చి లెక్కించటం మొదలుపెట్టారు. రాత్రి తొమ్మిదింటి వరకు రూ.6లక్షలు తేలింది. మరిన్ని మూటల్లోని నగదు లెక్కించాల్సి ఉంది.