అయోధ్య రామాలయం పరమతసహనానికి వేదికగా నిలుస్తోంది. హిందువులే కాదు.. ముస్లింలు సైతం మందిర నిర్మాణంలో ఏదో రకంగా పాలుపంచుకొని భారతదేశ గొప్పతనాన్ని చాటుతున్నారు. బాబ్రీ మసీదు కోసం చివరి వరకు ఫైట్ చేసిన ఇక్బాల్ అన్సారీ ఇటీవల భూమి పూజ కార్యక్రమానికి వెళ్లి మంచి సందేశాన్ని పంపగా.. తాజాగా అలాంటి ఉదాహరణే మరొకటి వెలుగుచూసింది.
అయోధ్య రాముడి కోసం 2.1 టన్నుల బరువున్న గంటను తయారు చేయిస్తోంది శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్. దీన్ని తయారు చేసే బాధ్యతను ఉత్తర్‌ప్రదేశ్ జలేసర్‌లో దావూ దయాల్ అనే కుటుంబానికి అప్పగించింది. అయితే ఈ గంట తయారీ కోసం వారివద్ద పనిచేసే ఓ ముస్లిం వ్యక్తి కీలకంగా మారడం విశేషంగా మారింది. గంట డిజైన్ చైయడం నుంచి తయారీ వరకు ఇక్బాల్ మిస్త్రీ అనే కళాకారుడే ముందుండి అన్నీ చూసుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే ఈ గంట తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతిని అనుసరిస్తున్నారు. బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, టిన్, ఇనుము, పాదరసం… ఇలా అష్టదాతువులను వినియోగిస్తున్నారు. మరో ప్రత్యేకత ఏమిటంటే.. గంటలో ఎలాంటి అతుకులు ఉండవు. ఈ భారీ గంట తయారీ కోసం రూ.21 లక్షలు ఖర్చుకానుంది. 25 మంది 4 నెలల పాటు ఈ తయారీలో పాలుపంచుకోనున్నారు.