మూగజీవాల పట్ల మనిషి తన మానవత్వాన్ని చాటుకోవాలి. వాటికి కూడా బాధ,నొప్పి కలుగుతాయని ఆలోచించి వాటితో ప్రవర్తించాలి. అప్పుడే మనం మనుషులం అనిపించుకుంటాం. అంతే కాని మూగజీవాలే కదా అని మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే.. అది సిగ్గుమాలిన పని అవుతుంది. అయితే ఓ వ్యక్తి కనీసం జాలి లేకుండా ప్రవర్తించడంతో ఓ కోతి ప్రాణం పోయింది. దీంతో జంతు ప్రేమికులే కాదు.. ఆ ప్రాంతంలోని ప్రజలందరూ ఏకమై..ఆందోళనకు దిగారు.
ఇక వివరాల్లోకి వెళితే.. బీహార్లో ఈ సంఘటన చోటుచేసుకుంది. షాకుంద్ బజార్ లోని సుమన్ జల్సన్ స్వీట్స్ దుకాణదారుడు సుమన్, కోతి కడుపులో రాడ్ ని పెట్టి అతి క్రూరంగా చంపేశాడు. దీంతో మార్కెట్ లో ఉన్న స్థానికులు అతడు చేసిన పనితో షాక్ అయ్యారు. ఒక మూగజీవాన్ని అంత దారుణంగా హతమార్చడం ఏంటని తీవ్రంగా ఖండించారు. కోతి మృతదేహంతో షాకుంద్ అక్బర్ నగర్ ప్రధాన రహదారిపై ఉన్న బీచ్ మార్కెట్ కు చేరుకుని నడిరోడ్డుపైనే.. భారీ ధర్నాకు దిగారు.
దుకాణదారుడు మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయి చేసిన సిగ్గుమాలిన పనికి అతడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో దుకాణదారుడు షాప్ కు తాళం వేసి పారిపోయాడు. అయితే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను శాంతింప చేయడానికి ప్రయత్నం చేశారు. కాని వారు వినకపోవడంతో పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది.
నిందితుడు సుమన్ ను పట్టుకొని అతని పై కేసులు పెడతామని వారు హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు వెనక్కి తగ్గారు. మరో వైపు కోతి మృతదేహాన్ని పోస్టు మార్టమ్ కోసం తరలించారు. అయితే ఇక పై ఇలాంటి సంఘటనలు రిపీట్ కాకుండా..దుకాణదారుడు సుమన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.