కరోనా వైరస్ కట్టడిలో టెస్టులది ముఖ్య భూమిక. అందుకే తెలంగాణలో కరోనా టెస్టుల కోసం ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తున్న సమయంలో ఇంటా బయట అనేక విమర్శలు ఎదురయ్యాయి. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీయే తెలంగాణలో టెస్టుల సంఖ్య పెంచాలంటూ సూచించారు.

తెలంగాణలో ప్రస్తుతం 6వేల పైచిలుకు ఆర్టీసీపీఆర్ టెస్టులు చేసే సామర్థ్యం ఉంది. ఇప్పుడా సంఖ్య దాదాపు 10వేలకు చేరనుంది. కారణం నిమ్స్ లో రోజుకు 3వేలకు పైగా కరోనా టెస్టులు చేసే కొబాస్ 8800 మిషన్ తెప్పియటమే. నిజానికి ఈ మెషిన్ ను ప్రభుత్వం స్వయంగా ఏమీ కొనుగోలు చేయలేదు. ఓ కార్పోరేట్ కంపెనీ కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ ఫండ్స్ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి డొనెట్ చేసింది. ఈ మెషిన్ ను రెండు నెలల కిందటే విదేశాల నుండి రాష్ట్ర ప్రభుత్వం తెప్పించింది. మెషిన్ చెన్నైకి వచ్చిన తర్వాత కోల్ కతాలో ఉన్న అత్యవసర పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఆ మెషిన్ ను పశ్చిమ బెంగాల్ కు పంపింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కొనుగోలు ఆర్డర్ పెట్టగా ఇప్పుడు అది నిమ్స్ కు చేరింది.
దాదాపు కోటి రూపాయలతో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యంతో ల్యాబ్ ను నిమ్స్ లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మెషిన్ కు కరోనా టెస్టింగ్ బాహుబలిగా పేరుంది. ఈ మెషిన్ టెస్టులు చేయటం ప్రారంభిస్తే రాష్ట్రంలో ఆర్టీ పీసీఆర్ ద్వారా టెస్టులు చేసే సామర్థ్యం ప్రతి రోజు 10వేలకు చేరుకుంటుందని, ర్యాపిడ్ టెస్టు కిట్స్ అదనం అని వైద్యారోగ్యశాఖ వర్గాలంటున్నాయి.