ఓ పెద్ద సినిమా ఫ్లాప్ అయినప్పడు కాస్త మొహమాటాలు ఉంటాయి. సినిమా డిజాస్టర్ అయిందని బయటకు చెప్పొచ్చా, చెప్పకూడదా అనే అనుమానాలుంటాయి. 3 రోజులు గడిస్తే ఎవరూ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, ఆటోమేటిగ్గా రిజల్ట్ బయటకొచ్చేస్తుంది. కానీ స్టార్ హీరో విజయ్ విషయంలో మాత్రం ఇలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు కోలీవుడ్ మీడియా. బీస్ట్ సినిమా విడుదలైన రోజు నుంచి అతడిపై విమర్శలు పడుతూనే ఉన్నాయి.
బీస్ట్ సినిమా ఇలా బయటకొచ్చిందో లేదో అలా కోలీవుడ్ మీడియా విజయ్ పై విమర్శల వర్షం కురిపించింది. అసలు విజయ్ స్క్రిప్ట్ మొత్తం చదివి ఈ సినిమా ఒప్పుకున్నాడా లేక రెమ్యూనరేషన్ కోసం నటించాడా అంటూ ఓపెన్ గానే విమర్శలు గుప్పించింది కోలీవుడ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా.
ఈ విషయంలో సినీ జర్నలిస్టులు కూడా తగ్గలేదు. విజయ్ ది రాంగ్ ఛాయిస్ అన్నారు. ఈమధ్య కాలంలో విజయ్ నటించిన బ్యాడ్ మూవీస్ లో బీస్ట్ దే ఫస్ట్ ప్లేస్ అని చెప్పుకొచ్చారు. విజయ్ స్టార్ డమ్ మీద దర్శకులు ఆధారపడడం ఆపేయాలని నేరుగా స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే బాగా లేకపోతే స్టార్ డమ్ కాపాడదని ఓపెన్ గా విమర్శిస్తున్నారు.
తమిళ్ లో పెద్ద సినిమాలు ఫ్లాప్ అవ్వడం కొత్తేంకాదు. ఆ మాటకొస్తే తళైవ రజనీకాంత్ సినిమాలే వరుసగా ఫ్లాప్ అయిన సందర్భాలున్నాయి. అజిత్, సూర్య సినిమాలు కూడా బాల్చీ తన్నేసిన ఘటనలున్నాయి. కానీ అప్పుడెప్పుడూ రాని క్రిటిసిజమ్, విజయ్ బీస్ట్ సినిమాతో మొదలైంది. ఇకపై కోలీవుడ్ లో స్టార్ హీరో సినిమా అయినా కథ బాగాలేకపోతే ఉపేక్షించేది లేదనే స్పష్టమైన సంకేతం బీస్ట్ ఫ్లాప్ తో అందరికీ అందింది. ఈ విషయంలో స్టార్ హీరో అనే కనికరమే లేదని తేలిపోయింది.