మూడు రాజధానుల వికేంద్రీకరణ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన ‘విశాఖ గర్జన’లో పాల్గొనడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. విశాఖ గర్జనలో లక్ష మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. కుల, మత, వర్గ భేషాజాలం లేకుండా ప్రజలంతా పెద్ద ఎత్తున కలిసి వచ్చారు. విశాఖ గర్జనలో పాల్గొనేందుకు రాష్ట్ర నలలుమూలల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. విశాఖ గర్జనకు విశాఖే పరిపాలనా రాజధానిగా కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు.
భారీ వర్షంలోనూ సుమారు రెండున్నర గంటల పాటు ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా ర్యాలీకి వైజాగ్ ప్రజలు సంఘీభావం తెలుపగా, విశాఖే రాజధానిగా రావాలంటూ నినాదించారు. ఈ ర్యాలీలో ప్రజలు, ప్రజా సంఘాలతో పాటు ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జేఏసీ నేతలు, మేధావులు, విద్యావేత్తలు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
విశాఖ గర్జన గ్రాండ్ సక్సెస్ అయిందని, వర్షం పడుతున్నా విశాఖలో నిర్వహించిన ర్యాలీకి లక్షమందికి పైగా హాజరయ్యారని జేఏసీ ప్రకటించింది. రాష్ట్రం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చి జై విశాఖ అంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానులతోనే రాష్ట్రానికి అభివృద్ధి అంటూ ప్రజా సంఘాలు నినాదాలు మిన్నంటాయి. వికేంద్రీకరణే లక్ష్యంగా తమ గొంతు వినిపించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు.
విశాఖ అంబేద్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డు వరకూ చేపట్టిన ర్యాలీలో అశేష జనవాహిని పాల్గొంది. రాజకీయాలకు అతీతంగా భారీ ప్రదర్శన చేపట్టగా దీనికి అన్ని వర్గాల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోంది. ఈ మేరకు ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని వివరిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. తరతరాల వెనుకబాటు తనంపై ఒక్కటైన ఉత్తరాంధ్ర ప్రజానీకం వికేంద్రీకరణతోనే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని నినాదించారు. అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు స్పీకర్ తమ్మినేని, పలువురు మంత్రులు.