ప్రోటోకాల్ పాటించడం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రధాని పర్యటనల సమయంలో ఆయన అందుబాటులో ఉండకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే.. ఇప్పుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కూడా ఇదే బాటలో పయనిస్తున్నారు.
హైదరాబాద్ పర్యటన ముగించుకుని ప్రధాని చెన్నై వెళ్లారు. ఎయిర్ పోర్టులో దిగగానే గవర్నర్ ఆర్ఎన్ రవి స్వాగతం పలికారు. డీఎంకే, బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులు కూడా స్వాగతం చెప్పారు. కానీ.. సీఎం స్టాలిన్ మాత్రం కనిపించలేదు. అయితే.. జేఎల్‌ఎన్ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మాత్రం హాజరయ్యారు.
కార్యక్రమంలో భాగంగా బెంగళూరు-చెన్నై మధ్య హైవే ప్రాజెక్టు సహా 11 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ప్రధాని మోడీ. దాదాపు రూ.31,500 కోట్లతో ఈ అభివృద్ధి జరగనుంది. అయితే.. ఇదే సభలో బీజేపీ, డీఎంకే కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అంతకుముందు.. ఎయిర్ పోర్ట్ నుంచి జేఎల్‌ఎన్ స్టేడియం వరకు రోడ్ షో నిర్వహించారు ప్రధాని. దారిపొడవునా మహిళలు, కార్యకర్తలు మోడీకి స్వాగతం పలికారు. మోడీ.. మోడీ నినాదాలతో చెన్నై వీధులు మార్మోగాయి. అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు మోడీ. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.