ఉన్నఫలంగా కోట్లకు కోట్లు జమ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారుతున్న ఖాతాదారులు.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరుగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఖాతాదారులకే ఎందుకీ బంపరాఫర్..? అసలు ఈ హెచ్‌డీఎఫ్‌సీ కి ఏమైంది..? అనేది రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్న వార్త. ఇది ఒకటి రెండు చోట్ల కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ఇదే తంతు.
వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వెంకట్ రెడ్డి.. అనే వ్యక్తి వికారాబాద్ పట్టణంలో మొబైల్ షాప్ నడుపుతుంటాడు. అయితే.. హెచ్‌డీఎఫ్‌సీ వికారాబాద్ బ్రాంచ్ లో ఇతనికి ఖాతా ఏంది. అందులో ఉన్నట్టుండి అతని ఖాతాలో 18.52 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. తన మొబైల్ కు వచ్చిన మెసేజ్ చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. ఇన్ని కోట్ల రూపాయలు తనకు ఎక్కడి నుంచి వచ్చాయని ఆలోచనలో పడ్డాడు.
అయితే.. పొరపాటున బ్యాంకు నుంచి తన ఖాతాలోకి వచ్చి ఉంటాయని అనుమానించిన వెంకట్ రెడ్డి.. వెంటనే బ్యాంకు అధికారులకు విషయం తెలిపారు. బ్యాంకు అధికారులు వెంటనే వెంకట్ రెడ్డి బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు.
ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. తన ఖాతాలో ఆ డబ్బులు ఎలా పడ్డాయో తెలియదన్నారు. బ్యాంకు అధికారులు అకౌంట్ ఫ్రీజ్ చేయడంతో ఎటువంటి లావాదేవీలు జరగడం లేదని తెలిపారు. లావాదేవీలు నిలిపివేయడంతో తాను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వెల్లడించారు వెంకట్ రెడ్డి.
మరోవైపు.. పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందని మరో మొబైల్ నిర్వాహకుడు ఇల్లందుల సాయి కి కూడా ఇలాంటి ఘటనే ఎదురైంది. అతనికి హెచ్‌డీఎఫ్‌సీ మంథని బ్రాంచ్ లో ఉన్న అకౌంట్ లో.. ఉన్నపళంగా సుమారు రూ. 5 కోట్ల పైన జమయ్యాయి. తర్వాత కాసేపటికే తన అకౌంట్ ను ఫ్రీజ్ చేశారు బ్యాంక్ అధికారులు.