శేషాచలం సానువుల్లో కొలువైన కలియుగ దైవం వేంకటేశ్వరున్ని దర్శించుకోవాలని కోట్లాది భక్తులకు ఉంటుంది. ఎన్నిసార్లు శ్రీవారి దర్శన భాగ్యం కలిగినా మళ్లీ రావాలనే పుణ్య ప్రదేశం తిరుమల. రెండేళ్లుగా కరోనా దెబ్బకు అనేక ఆంక్షలు విధించింది టీటీడీ. దాని ఫలితంగా చాలామంది భక్తులు శ్రీవారి దర్శనానికి దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆన్ లైన్ లో కోటా పెట్టి శ్రీవారి దర్శనం కల్పిస్తూ వస్తోంది టీటీడీ. అయితే.. సర్వదర్శన టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది.
రెండు రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ ల దగ్గర సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. భక్తుల రద్దీ పెరగడంతో తోపులాట జరిగి ముగ్గురు భక్తులు గాయపడ్డారు. వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. పలువరు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు.
టీటీడీ కఠిన నిర్ణయాలతోనే భక్తులకు ఇలాంటి అవస్థలు ఏర్పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు, నాలుగు రోజుల నుంచి టోకెన్ల కోసం ఎదురుచూస్తున్నామని కొందరి భక్తులు వాపోయారు. కనీసం కొండపైకి కూడా వెళ్లనివ్వడం లేదని.. దర్శనం కాకపోయినా.. తలనీలాలు అన్నా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని చెబుతున్నారు. ఎన్నో ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని.. గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తోపులాటలో చాలామంది పిల్లలు తప్పిపోయినట్టు చెబుతున్నారు. పోలీసుల లేకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని భక్తులు వాపోయారు. మరోవైపు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్లు లేకపోయినా సర్వదర్శనం కల్పిస్తామని అధికారులు తెలిపారు. నేరుగా కొండపైకి చేరుకోవాలని సూచించారు. ఇటు రద్దీ దృష్ట్యా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. బుధవారం నుంచి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది టీటీడీ.