తెలంగాణలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీగా వానలు పడ్దాయి. నగరవాసులతో పాటు మిగిలిన జిల్లాల వాసులు కూడా అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది.
గ్రేటర్ నగరంతో పాటు మహబూబ్‌నగర్, జనగామ, సూర్యాపేట,యాదాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ఉంటుందని ప్రకటించింది. కాగా 4 రోజులు అక్కడక్కడా కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ రాష్ట్ర సంచాలకురాలు డాక్టర్ నాగరత్న వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకపోవడం మంచిదని సూచించారు. ఎగువన కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్లు ఎత్తివేశారు అధికారులు. సింగూరు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తి వేసి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వన దుర్గ మాత ఆలయం వద్ద వరద నీరు ప్రవహిస్తోంది.
ఆలయంలోకి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆలయం మూసివేశారు అధికారులు.రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పూజలు నిర్వహిస్తున్నారు.భారీ వర్షాల కారణంగా మెదక్ జిల్లా కలెక్టర్ మెదక్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు లోకల్ హాలిడే ప్రకటించారు.