డిసెంబర్, జనవరి అంటే కొత్త సినిమాల సందడి తెలిసిందేగా. ముఖ్యంగా పెద్ద సినిమాల హడావుడి మామూలుగా ఉండదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పుష్ప మూవీ కోలాహలం నడుస్తోంది. ఇదే అదునుగా టిక్కెట్ల దోపిడీకి తెరతీశారు. ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంతో అక్కడ వచ్చే లాస్ ను తెలంగాణలో కవర్ చేసేందుకు ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేశారు. ఒక్కో టిక్కెట్ రేటు వంద, 150, 200 కూడా దాటిపోయింది.
హైదరాబాద్ లోని ఐమ్యాక్స్ లో పుష్ప సినిమా ఒక్కో టిక్కెట్ పై 250 రూపాయలు వసూలు చేస్తున్నారు. సాధారణ రోజుల్లో అయితే ఐమ్యాక్స్ ధర 150 రూపాయలే. కానీ.. ఇప్పుడు ఏకంగా 250 రూపాయలకు పెంచారు. అంటే మామూలు రోజులతో పోలిస్తే ఒక్కో టిక్కెట్ పై వంద రూపాయల అదనపు బాదుడు అన్నమాట. అంటే నలుగురు ఉన్న ఓ ఫ్యామిలీ సినిమా చూడాలంటే కేవలం టిక్కెట్ల కోసమే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టాలి. ఒక్క ఐమ్యాక్సే కాదు.. నగరంలోని ఇతర మల్టీప్లెక్సుల్లోనూ ఇదే దందా నడుస్తోంది. దీంతో ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టిక్కెట్ పై ఏకంగా వంద రూపాయలు పెంచడం ఏంటని మండిపడుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నలుగురి చేతిలోనే ఉండడం.. నిర్మాతలు వారే.. ఎగ్జిబిటర్లు వాళ్ళే కావడం.. హీరోలు కూడా వాళ్ళ పిల్లలే అవడంతో రెచ్చిపోతున్నారు. అందుకే ఏపీలో వచ్చే నష్టాన్ని ఇక్కడ పూడ్చేందుకు చూస్తున్నారు. అడ్డగోలుగా రేట్లను పెంచేశారు. పైరసీని ప్రోత్సహించొద్దు .. థియేటర్లోనే సినిమా చూడండి అని నీతులు చెప్పేవాళ్లు రేట్లను ఇష్టం వచ్చినట్లు పెంచడం కరెక్టేనా అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. ఎక్కడో వచ్చే నష్టానికి ఇక్కడి ప్రేక్షకులపై భారం వేయటం ఏంటని నిలదీస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కూడా సైలెంట్ గా ఉండడంపై విమర్శలు చేస్తున్నారు ప్రేక్షకులు.