తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనతో పలు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు రెడీగా వున్నట్టు మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రకటించాయి.
తాజాగా మరో అంతర్జాతీయ సంస్థ గ్రిడ్ డైనమిక్స్ నగరంలో డెలివరీ సెంటర్ విస్తరణ చేపట్టనున్నట్టు ప్రకటించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణహిత వాహనాలను అతి తక్కువ ధరకు అందించాలన్న ప్రభుత్వ ప్రణాళికలకు అనుగుణంగా ఈ ఒప్పందం జరిగింది.
ఇందులో భాగంగా జీరో ఉద్గారాలను విడుదల చేసే వాహనాల కోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు. మరోవైపు హైదరాబాద్ లో డేటా సెంటర్ ను అభివృద్ధి చేసేందుకు గాను 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ పార్ట్‌నర్స్ సంస్థ కేటాయించింది.
ఇప్పటికే తెలంగాణలో టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు ట్రావెలింగ్ దిగ్గజ సంస్థ మాండీ ప్రకటించింది. ఆటో మొబైల్ రంగంలో గేర్లను ఉత్పత్తి చేసే రేవ్ గేర్స్ సంస్థ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది.