తెలంగాణ ప్రభుత్వం బెంగళూరుకు దీటుగా హైదరాబాద్ ను ఐటీ సిటీగా డెవలప్ చేయాలని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగామేడ్చల్ జిల్లా కండ్లకోయలో మన రాష్ట్రంలోనే అతి ఎత్తైన ఐటీ పార్కును నిర్మించే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా ఫిబ్రవరి 17న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇదే ఎత్తైనది. 5 లక్షల చదరపు అడుగులలో 14 అంతస్తుల్లో నిర్మాణానికి 40 మీటర్ల కార్యాలయ స్థలాన్ని నిర్ణయించారు.
ఒక్క ట్వీట్ ద్వారా తెలంగాణలో అత్యంత ఎత్తైన భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో 100 కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు. ఈ పార్కును దాదాపు వంద కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం కేటాయించనుంది. దీని ద్వారా 15 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 20వేల మందికి పైగా పరోక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయని కొంపల్లి ఐటీ ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. అసోసియేషన్ ప్రెస్ మీట్ లో వెంకట్, సభ్యులు ప్రభుత్వ సహకారంపై స్పందించారు.
లాస్య ఇన్ఫోటెక్ కంపెనీ 2018 ఏప్రిల్ 29న మంత్రి కేటీఆర్ కి ట్వీట్ చేసింది. గత 15 ఏళ్ల నుంచి గచ్చిబౌలిలో ఉద్యోగాలు చేస్తున్న కొంతమంది టెకీలు స్వతహాగా కొంపల్లి పరిసరాల్లో స్టార్టప్స్ నెలకొల్పినట్లు పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం కావాలని కోరారు. ఆ ట్వీట్ కు స్పందించిన మంత్రి కేటీఆర్ త్వరలో కొంపల్లిలో ఐటీ హబ్ రానున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం మేడ్చల్ జిల్లా అధికారులు, కొంపల్లి ఐటీ ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ సభ్యులు కలిసి దుండిగల్, పేట్ బషీరాబాద్ లో భూమిని పరిశీలించారు. చివరగా కండ్లకోయ వద్ద 10 ఎకరాల భూమిని కేటాయించినట్లు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.
ప్రస్తుతం కండ్లకోయలో చేపట్టనున్న ఐటీ పార్కులో మొత్తం 120 కి పైగా సంస్థలు ఉన్నాయి. అందులో 90 కంపెనీలకు నూతనంగా నిర్మించే ఐటీ టవర్స్ లో స్థలాలు కేటాయించారు. ఫిబ్రవరి 17న శంకుస్థాపన సందర్భంగా ఆ కంపెనీల ప్రతినిధులకు కేటాయింపు పత్రాలను మంత్రి కేటీఆర్ అందించనున్నట్లు కొంపల్లి ఐటీ ఎంటర్ ప్రెన్యూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట్ తెలిపారు. ఫేస్ 2లో భాగంగా దుండిగల్ లో 450 ఎకరాల్లో ఐటీని విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని ఆయన తెలిపారు.
హైదరాబాద్ కు నలువైపులా ఐటీ అభివృద్ధిలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో దీన్ని చేపడుతున్నట్టు ఆయన వెల్లడించారు. విమానాశ్రయానికి 45 నిమిషాల్లో చేరుకునే సౌకర్యంతో పాటు రహదారుల అనుసంధానం వంటి వాటిని సానుకూలమని ప్రభుత్వం భావించినట్లు తెలిపారు. కండ్లకోయ జంక్షన్ వద్ద స్థల ఎంపిక పూర్తికావడంతో నిర్మాణ ప్రణాళికను సర్కారు వేగవంతం చేసింది. అందులోనూ మంత్రి కేటీఆర్ ఐటీని హైదరాబాద్ లో విస్తరించాలని భావించడం ప్లస్ పాయింట్ అయింది. ఐటీ పార్కు బాధ్యతలను టీఎస్‌ఐఐసీకి అప్పగించింది. ఇందులో సమావేశ మందిరాలు, భారీ పార్కింగు తదితర సౌకర్యాలు కల్పించనున్నారు.