పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా గురువారం ఢిల్లీలో కొనసాగిన నిరసనల వల్ల పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకుపోయారు. ఉదయం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వారు మధ్యాహ్నం వరకు కూడా ఆఫీసుకు చేరుకోలేకపోయారు. అందరూ తాము ట్రాఫిక్ లో చిక్కుకు పోయామంటూ వాట్సాప్ మెసేజ్ లు పెట్టారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో కొన్ని స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్ధులు సాయంత్రం ఇళ్లకు వెళ్లేటప్పుడు స్నాక్స్ పంచాయి.
ట్రాఫిక్ జామ్ విమాన సేవలకు కూడా తీవ్ర ఆటంకం కలిగించాయి. విమాన సిబ్బంది కూడా గంటల తరబడి ట్రాఫిక్ లో చిక్కుకొని సమయానికి వెళ్లలేకపోయారు. ఇండిగో ఎయిర్ లైన్స్ ఢిల్లీ నుంచి వెళ్లే 19 విమానాలను రద్దు చేసింది. మరో 16 విమానాలను ఆలస్యంగా నడిపింది. కొన్ని విమానాల్లో వెళ్లాల్సిన ప్రయాణీకులు సమయానికి రాలేకపోయారు. తమ సిబ్బంది ట్రాఫిక్ లో చిక్కుకోవడం వల్ల సమయానికి విమానాలకు నడపలేకపోతున్నాము..తర్వాత విమానాల్లో పంపిస్తాం అంటూ విస్తారా, ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించాయి.
అంతకు ముందు రెడ్ ఫోర్ట్ దగ్గర నిరసన తెలిపేందుకు వచ్చే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ తో పాటు వందలాది మంది అరెస్టయిన వారిలో ఉన్నారు. ఢిల్లీలోని దాదాపు చాలా మెట్రో స్టేషన్లను మూసివేశారు.