జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రాజధాని టోక్యోకు సమీపంలోని ఫుకుషిమా తీర ప్రాంతంలో ఈ భూకంపం వచ్చింది. 11 ఏండ్ల క్రితం ఫుకిషిమా న్యూక్లియర్ ప్లాంట్ ప్రమాదం జరిగిన చోటుకు సమీపంలో ఈ భూకంపం సంభవించడం గమనార్హం.
దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. దీని వల్ల ఇద్దరు మరణించగా. సుమారు వంద మంది వరకు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.
సముద్ర మట్టానికి 20.5 మైళ్ల లోతులో భూకంప కేంద్రం నిక్షిప్తమైనట్టు తెలిపారు. హొన్షూ తూర్పు తీర ప్రాంతంలో సునామీ హెచ్చరికలను ఫసిపిక్ సునామీ హెచ్చరికల కేంద్రం అధికారులు చేశారు.
భూకంప కేంద్రానికి 186 మైళ్ల దూరంలో ఉన్న తీర ప్రాంత ప్రజలకు ప్రమాదకర సునామీ అలలు వచ్చే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. దీంతో తీర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు. భూ ప్రకంపనల వల్ల రాజధానిలో చాలా సమయం వరకు విద్యుత్ అంతరాయం కలిగింది.