‘పిల్లి శాపాలకు కూడా తెగదు’ అన్న సామెత అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ఓ పిల్లి చేసిన పనికి ఏకంగా వందల కోట్లలో నష్టం ఏర్పడింది. 60 వేల ఇళ్లను ఒక్కసారిగా చీకటిమయం చేసింది. ఈ ఘటన ఎక్కడో కాదండి.. మన పక్క రాష్ట్రమైన మహారాష్ట్రంలో చోటుచేసుకుంది. ఇంతకి ఆ పిల్లి ఏం చేసింది. మియామ్ మియామ్ అంటూ తిరిగే పిల్లి కారణంగా ఇంత భారీ నష్టం ఏమై ఉంటుంది. మరీ ఈ వార్త చదివి తెలుసుకోండి.
మహారాష్ట్రలో పుణె పట్టణ శివారున పింప్రీ చించువాడ ఏరియా పరిధిలోని పారిశ్రామికవాడలోని మహా ట్రాన్స్‌మిషన్ సబ్‌స్టేషనులోని ట్రాన్స్‌ఫార్మరు మీదికి పిల్లి ఎక్కింది. దీంతో ఒక్కసారిగా షార్ట్ సర్య్కూట్ అయి ఏకంగా 60 వేల విద్యుత్తు కనెక్షన్లు తెగిపోయాయి. అకుర్ది ప్రాంతాల్లో 60 వేల మంది వినియోగదారులకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పారిశ్రామిక వాడ కావడంతో కుటీర పరిశ్రమలు విద్యుత్ అంతరాయంతో నిలిచిపోయాయి.
అయితే, ఇది 100 ఎంవీఏ సామర్ధ్యం ఉన్న ఈ ట్రాన్స్‌ఫార్మర్ కావడంతో పిల్లి పైకి ఎక్కగానే ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ వినియోగం కూడా పెరిగింది. మొత్తం లోడ్ పక్కనే ఉన్న ఇంకో ట్రాన్స్‌ఫార్మర్‌పై పడింది. దీంతో దాని పరిధిలోని ప్రాంతంతో విద్యుత్ సరఫరా ఆగింది. అసలు ఏం జరిగిందో తెలియక స్థానికులు నానా అవస్థలు పడ్డారు. అయితే, మరో మూడు రోజులపాటు పునరుద్ధరణ అవకాశాలు కనిపించడం లేదు.
విద్యుత్తు పొదుపుగా వాడాలని, భారమంతా సింగిల్ ట్రాన్స్‌ఫార్మరుపై పడుతోందని ఆ శాఖ అధికారి జ్యోతి చిప్టే స్థానికులకు విజ్ఞప్తి చేశారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని తెలిపారు. ఇక, ఈ అసౌకర్యానికి క్షమాపణలు కోరిన మహా ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్.. లోపాన్ని పూర్తిగా సరిదిద్దే వరకు సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ఓవర్ లోడ్ కారణంగా ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు గురైందని కొత్తది ఏర్పాటుచేస్తామని తెలిపింది. దీనికి రెండు మూడు రోజుల సమయం పడుతుందని పేర్కొన్నారు. అంత వరకూ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా జరుగుతుందని చెప్పారు. పారిశ్రామిక సంఘంతో చర్చించిన అధికారులు లోడ్ షెడ్డింగ్‌ను ప్రారంభించారు. వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు సమయాల్లో లోడ్‌షెడ్డింగ్‌లు జరిగినట్టు తెలిపారు.