నిరసన ప్రజాస్వామిక హక్కు. ఎన్నికల్లో పోటీ ప్రజాస్వామిక హక్కే. నిరసనపై ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపొచ్చు. కానీ ఎన్నికల్లో పోటీపై… ఏమీ చేయలేవు. అణచివేయబడుతున్న వర్గాల నిరసనను ప్రపంచానికి చాటేందుకు ఎన్నికలనే ఎంచుకుంటే..? నిజామాబాద్ రైతులు చూపిన దారిలో, హుజుర్ నగర్ లో కూడా అదే చేయబోతున్నారు.
తెలంగాణ అన్ని వర్గాలు సంతృప్తిగా లేవు. ముఖ్యంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సమ ప్రాధాన్యత లేదన్న అసంతృప్తి ప్రధానంగా ఉంది. ముఖ్యంగా ప్రజాసంఘాలు, మేధావులు, యువత ఇలా దాదాపు అన్ని వర్గాల్లో ఉంది. చినుకు చినుకు కలిస్తేనే వరదవుతుంది అన్నట్లు… ఉమ్మడిగా ప్రభుత్వం పై నిరసన తెలియజేయలేని వర్గాలన్ని ఒక్కటై…. రాబోయే హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాయి. నిజామాబాద్ లో రైతులు తమ డిమాండ్ల సాధక కొరకు ఎన్నికల్లో ఎలా పోరాడారో… ఎలాంటి ఫలితాన్ని సాధించారో అలాంటి విజయం కోసం తెలంగాణలో అణగారిన, అణచివేయబడుతున్న వర్గాలు పోటీకి సై అంటున్నాయి.
ఓవైపు… ప్రధాన రాజకీయ పార్టీల్లో పోటీపై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి. ఓట్లు చీలుతాయన్న పేరుతో కాంగ్రెస్ పార్టీ తానే నిలబడే ప్రయత్నం చేస్తోంది. కానీ కాంగ్రెస్ లోని పెద్దలు అధికార పార్టీతో అంటకాగుతున్నారని ఆ పార్టీ నేతలే చెప్తుంటారు. అలాంటప్పుడు కాంగ్రెస్ ను పూర్తిగా నమ్మోచ్చా… అంటే నమ్మలేం. అందుకే పోటీకి దిగబొతున్నాం అంటున్నారు సామాజికవేత్తలు. అయితే… కోదండరాం లాంటి మేధావులు కూడా కేసీఆర్ ఉచ్చులో పడకుండా, తన పార్టీ తరుపున అభ్యర్థిని పోటీలో ఉంచాలని, కేసీఆర్ ను ఓడించాలనుకుంటున్న ప్రతి రాజకీయ పార్టీ తమ అభ్యర్థిని బరిలో దించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఉస్మానియా జేఏసీ నుండి, ఓయూ కేంద్రంగా ఉన్న దళిత సంఘాలతో పాటు దగా చేశారంటున్న రాష్ట్రంలోని ప్రధాన దళిత సంఘాలు, నిరుద్యోగ జేఏసీ నుండి, కేసీఆర్ ప్రభుత్వంలో ఎటూ కాకుండా పోయిన కౌలు రైతుల తరుపున కొందరు, అమరవీరుల కుటుంబాల తరుపున కొందరు, ఉద్యమ ప్రస్థానంలో ఉండి… కేసీఆర్ రాజకీయాలకు బలైన వారు కొందరు, ఇలా దాదాపు 200మందికి పైగా హుజుర్ నగర్ లో పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. తద్వారా బ్యాలెట్ ఎన్నికను తప్పనిసరి చేసి, ప్రభుత్వ జిమ్మిక్కులకు చెక్ పెట్టడంతో పాటు నిజామాబాద్ రైతులు సాధించిన విజయాన్ని పునరావృతం చేస్తామంటున్నారు. తద్వారా అధికార పార్టీకి మరోసారి తమ బలాన్ని రుచి చూపించబోతున్నాం అంటున్నారు.