మూలా నక్షత్రం విశేషమైన రోజు కావడంతో దుర్గ గుడికి భక్తులు పోటెత్తారు. ఈ ఒక్కరోజే మూడు లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. విజయవాడలో ఎటు చూసినా ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులే కనిపిస్తున్నారు.
విజయవాడ: శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాలు సందడిగా వున్నాయి. ఈ తెల్లవారుజాము నుంచే అక్కడ భక్తుల తాకిడి మొదలయ్యింది. తెల్లవారుజామున 2 గంటల నుంచే దర్శనం ప్రారంభించారు.
అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా ఇవాళ దుర్గమ్మని దర్శించుకోడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు. మూడు లక్షల మంది భక్తులు దర్శించుకుంటారని అంచనా. శుక్రవారం వరకు అమ్మవారిని 5.18 లక్షల మంది దర్శించుకున్నారు. రూ.1.80 కోట్ల రూపాయల ఆదాయం లభించినట్టు దేవస్థానం ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్ సురేష్‌బాబు చెప్పారు.
భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో వారికి మజ్జిగ, వాటర్ ప్యాకెట్లు, చిన్నపిల్లలకు పాలు క్యూలైన్లలోనే అందిస్తున్నారు. ఈరోజు భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని 30 వేల మందికి అన్నప్రసాదం ఏర్పాటు చేశారు.