తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓయూ స్టూడెంట్స్ ఎజెండా అమలుకు ప్రత్యేక నిధులు కేటాయించాలంటూ ఉస్మానియా యూనివర్సిటీలో PDSU ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం PDSU ఓయూ నేతలు ఎస్ నాగేశ్వర రావు, ఎన్ సుమంత్, కే స్వాతి మాట్లాడుతూ.. ఓయూలో మెస్ డిపాజిట్ల పద్దతిని రద్దు చేసి, ఉచిత మెస్ వసతి కల్పించాలని కోరారు.
ఓయూ విద్యార్థుల స్కాలర్ షిప్ ను రూ.1500 నుంచి రూ.3000 వరకు పెంచాలన్నారు. ఓయూ విద్యార్థులకు రూ.3000, రీసెర్చ్ స్కాలర్లకు రూ.10,000 ప్రతి నెలా ఫెలోషిప్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్థులకు హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించాలి.
ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్ లో కనీసం రూ.1000 కోట్ల నిధులు కేటయించాలన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను రెగ్యులరైజ్ చేసి, కోర్స్ ఫీజు మొత్తం ప్రభుత్వమే రీయింబర్స్ చేయాలన్నారు.
అందరికీ సకాలంలో హాస్టల్ వసతి ఇవ్వాలన్నారు. ఓయూలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ఓయూలో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, సమస్యలు పరిష్కరించాలని వారు కోరారు.