కేసీఆర్, మోడీ ఇద్దరు తోడు దొంగలుగా మారి రాష్ట్రం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఉద్యమాలు చేస్తుంటే.. పోలీసులు అందుకు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ ధర్నాలకు అనుమతిస్తున్న పోలీసులు.. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అనుమతించరో చెప్పాలని ప్రశ్నించారు.
పెరిగిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు, కరెంట్ చార్జీలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ విద్యుత్ సౌధ ముట్టడికి పిలుపునిచ్చింది. ఉదయం నుండి హౌజ్ అరెస్టు చేయబడిన రేవంత్.. ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో తన ఇంటి నుండి విద్యుత్ సౌధ వరకు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయల్దేరారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కాంగ్రెస్ వరస ఉద్యమాలకు పిలుపునిచ్చింది. అధిష్టానం పిలుపు మేరకు.. విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ యత్నించింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు.. పలువురు కాంగ్రెస్ నేతలను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. రేవంత్ రెడ్డి ఇంటి వైపు ఉన్న రోడ్ల వద్ద బారికేడ్లు పెట్టి దిగ్బంధం చేశారు.
కాగా.. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపు, విద్యుత్ చార్జీల పెంపు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై విద్యుత్ సౌధ, సివిల్ సప్లై కార్యాలయాల ముట్టడికి కాంగ్రెస్ పార్టీ పిలుపు ఇచ్చింది. ఈ ఇంటి నుండి బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి.. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ర్యాలీగా బయలుదేరారు. కాసేపట్లో విద్యుత్ సౌధ దగ్గరకు చేరుకోనున్నారు రేవంత్ రెడ్డి.