పోస్టర్లు, ఫ్లెక్సీలు.. ప్రచారంలో రాజకీయ పార్టీల మొదటి అస్త్రాలివి. సభలు,సమావేశాలు, ర్యాలీలు ఎన్ని పెట్టినా.. పోస్టర్లు, ఫ్లెక్సీలు మస్ట్ గా ఉండాల్సిందే. మరి ఈ పోస్టర్లే ఇప్పుడు దేశ వ్యాప్తంగా హల్ చల్ చేస్తున్నాయి. ప్రతిపక్షాలు కాని ప్రజలు కాని అధికార పక్షం పై వ్యతిరేకతను బహిర్గతం చేయడానికి రాత్రి కి రాత్రే పోస్టర్లను అతికించి రచ్చ చేస్తున్నారు.
అదే విధంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సాగుతున్న పోరులో కూడా ఈ పోస్టర్లే రచ్చ రచ్చ చేశాయి. ముఖ్యంగా మరక అంటదూ.. అంటూ ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు ముందు హైదరాబాద్ నిండా వెలిసిన పోస్టర్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ఇప్పుడు ఢిల్లీని పోస్టర్లు షేక్ చేస్తున్నారు. “కేజ్రీవాల్ హఠావో.. ఢిల్లీ బచావో” అంటూ రాత్రికి రాత్రి బీజేపీ నాయకుడి పేరుతో ఢిల్లీ అంతటా పోస్టర్లు అతికించారు. అయితే “మోదీ హఠావో.. దేశ్ బచావో” అంటూ పోస్టర్లు వెలిసిన నెక్ట్స్ డే నే వీటిని అతికించడం విశేషం.
మరో వైపు వీటిని అతికించిన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేజ్రీవాల్ మాత్రం “ ఢిల్లీలో ప్రజలు నాకు వ్యతిరేకంగా పోస్టర్లు వేశారు. దీనికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు..ప్రజాస్వామ్యంలో తమ నాయకుడిని అనుకూలంగా లేదా వ్యతిరేకంగా తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ప్రజలకు ఉంది” అని ట్వీట్ చేశారు.
తనకు వ్యతిరేకంగా పోస్టర్లు అతికించిన వారిని అరెస్ట్ చేయొద్దని సూచించారు. కాగా, బీజేపీ నాయకుడు మంజీందర్ సింగ్ సిర్సా పేరుతో ఈ పోస్టర్లు అంటించారు. అయితే విద్య, వైద్యం, ఎక్సైజ్ శాఖల్లో కేజ్రీవాల్ అక్రమాలకు పాల్పడుతున్నారని.. ఈ పోస్టర్లను తానే అంటించినట్లు ఆయన ఒప్పుకుంటున్నారు. మొత్తానికి ఈ పోస్టర్లు ఢీల్లీ పాలిటిక్స్ లో రచ్చ చేస్తున్నాయి.