నాసిక్ లో 15 ఏండ్లుగా మూతపడి ఉన్న ఓ దుకాణంలో మానవ శరీర అవయవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఎనిమిది చెవులు, మెదడు, కండ్లు, ఇతర అవయవాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఘటన నాసిక్ లో కలకలం రేపుతోంది.
పోలీసుల వివరాల ప్రకారం.. మూత పడిన దుకాణం నుంచి గత కొన్ని రోజులుగా దుర్వాసన వస్తోంది. తాజాగా అది మరింత ఎక్కువైంది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకుని దుకాణాన్ని తెరిచి చూశారు.
అందులో తనిఖీలు చేయగా రెండు డ్రమ్ముల నుంచి వాసన వస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే తెరచి చూడగా మనిషి పుర్రెలు, ఇతర శరీర అవయవాలు ఉన్నాయి. వెంటనే వాటిని ఫొరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఈ అవయవాలు ఆ దుకాణంలోకి ఎలా వచ్చాయనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.
ఆ షాపు యజమాని ఇద్దరు కుమారులు వైద్య వృత్తిలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం అక్కడకు తెచ్చారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.