ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం తీవ్ర మానవ సంక్షోభానికి దారితీస్తోంది. భీకర క్షిపణి, బాంబు దాడులతో రక్త పాతాన్ని సృష్టిస్తోంది. రక్తపాతం, విధ్వంసానికి దూరంగా కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు పొట్టచేతబట్టుకొని పరాయి దేశాలకు వలసపోతున్నారు. యుద్ధం ఆరంభమైన 11 రోజుల్లోనే ఈ వలసవాదుల సంఖ్య 15 లక్షలు దాటిపోయింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో ఇంత భారీ స్థాయిలో వలసపోవడం ఇదే మొదటిసారని యూఎన్‌హెచ్‌సీఆర్ ఆదివారం తెలిపింది.
ఈ సంఖ్య 70 లక్షలకు చేరొచ్చని ఐరోపా సంక్షోభ నిర్వహణ విభాగం కమిషనర్ పేర్కొన్నారు. 1.8 కోట్ల మంది ఉక్రెయిన్ వాసులపై ఈ యుద్ధ ప్రభావం పడొచ్చని తెలిపారు. ఇది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద శరణార్థి సంక్షోభంగా మారొచ్చని ఐఖ్య రాజ్య సమితి హెచ్చరించింది.
వారిలో ఎక్కువగా మహిళలు, వృద్ధులు, పిల్లలు ఉంటున్నారు. తీవ్ర చలి, ఆకలి, దప్పికల నడుమ శరణార్థులు ప్రయాణం సాగుతోంది. దీంతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయి శరణార్థి శిబిరాల్లా మారుతున్నాయి. బోగీల్లోకి ప్రవేశించడానికే ప్రజలు నానా అగచాట్లు పడుతున్నామని అంటున్నారు. పొరుగు దేశ సరిహద్దులకు చేరే క్రమంలో చివరి 50 కిలోమీటర్ల దూరాన్ని నడిచి వెళ్లాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఉక్రెయిన్ వీడేవారిలో ఎక్కువ మంది పశ్చిమాన ఉన్న పోలండ్, మాల్దోవా, స్లొవేకియా, రొమేనియా, హంగరీలకు వెళుతున్నారు. ఈ దేశాలు వీరి కోసం సరిహద్దులను తెరిచాయి. కొద్దిసంఖ్యలో రష్యా, బెలారస్ కు తరలిపోతున్నారు. వీరిలో దాదాపు లక్ష మంది ఈ దేశాల నుంచి ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.